ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్ ..!!

SMTV Desk 2019-11-25 11:58:46  

మహా నాటకం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అందరూ మహా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మహా రాజకీయాలను ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ వీడియో వైరల్‌గా మారింది. మరాఠా నాటకాన్ని కబడ్డీతో పోలుస్తూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేయడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చని, చివరి క్షణంలోనైనా ఓటమి గెలుపుగా మారిపోవచ్చని ఓ కబడ్డీ వీడియోను పోస్ట్ చేసి గతంలో ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్ర, అదే వీడియోను మళ్లీ రీట్వీట్ చేసిన ఆయన మహారాష్ట్రలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఇంతకన్నా బాగా వివరించగలమా అని ప్రశ్నించారు.

వీడియోలో రెండు జట్లు కబడ్డీ ఆడుతుంటాయి. ఓ జట్టు ఆటగాడు కూతకు వచ్చి ఒకరిని ఔట్ చేసి తిరిగి వెళ్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా, అవుటయిన ఆటగాడు వచ్చి ఆ ఆటగాన్ని పట్టుకుని తమ వైపుకు లాగేస్తాడు. మిగిలిన ఆటగాళ్లంతా అతన్ని కదలకుండా పట్టుకుని ఔట్ చేసి పాయింట్ గెలుచుకుంటారు. మొదట పాయింట్ సంపాదించుకున్నట్టు కనిపించిన జట్టు చివరి క్షణాల్లో పాయింట్ కోల్పోతుంది. ఈ ట్వీట్ మహా రాజకీయాలకు అతికినట్టు సరిపోయిందని నెటిజన్లు అంటున్నారు.