అర్జునుడికి గంగ శాపం...కుమారుడి చేతిలో మరణం...!

SMTV Desk 2019-11-25 11:53:26  

కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం తలపెట్టాడు. ఇందుకు మేలుజాతి గుర్రాన్ని ఎంపిక చేసి పాండవ సోదరులు తీసుకొచ్చారు. వేదోక్త విధులు నిర్వర్తించిన తర్వాత ధర్మరాజు ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. దీనికి కాపలాగా అర్జునుడు గాండీవం, అక్షయ తూణీరం ధరించి వెళ్లాడు. అది త్రిగర్త, ప్రాగ్జోతిషపురం, సింధుదేశం నుంచి మణిపురంలోకి ప్రవేశించింది. తన తండ్రి అర్జునుడు వస్తున్న విషయం తెలిసిన మణిపురం యువరాజు బభ్రువాహనుడు ఆయనకు ఎదురెళ్లి నమస్కరించాడు. అర్జునుడు తన కుమారుని ఆదరించలేదు సరికదా ఈసడించుకున్నాడు. ఈ నిరాదరణకు కారణం తెలియని బభ్రవాహనుడు మౌనంగా పక్కకు తప్పుకున్నాడు. ఈ సంఘటనతో కలత చెందిన అతడు విచారంగా వెనుదిరిగాడు. ఈ సమయంలో ఒక స్త్రీ ఎదురుగావచ్చి, ‘నాయనా! నేను నీకు అమ్మనవుతాను.. ఓ నాగకన్యను! నా పేరు ఉలూచి. నీకు హితం చెప్పడానికి వచ్చాను. యుద్ధం రాజధర్మం. వెళ్లి నీ తండ్రి సవ్యసాచితో యుద్ధం చెయ్యి. ఆయనకు అది ప్రియమవుతుందని’ చెప్పింది. ఉలూచి మాటలకు బదులిచ్చి బభ్రువాహనుడు.. తల్లీ! తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను తప్పా, పిరికివాడిని కాదు. నువ్వు చెప్పినట్టే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తానని ఆమెకు నమస్కరించి అస్త్రశస్త్రాలతో రథాన్ని అధిరోహించి అశ్వానికి అడ్డుపడ్డాడు. దీనిని చూసి మెచ్చుకున్న పార్థుడు, అతడితో యుద్ధం చేశాడు. ఇద్దరి మధ్యా చాలాసేపు యుద్ధం సాగుతుండగా, చివరకు లిప్తపాటులో కొడుకు వేసిన శరం సవ్యసాచి గుండెల్లో దిగబడేసరికి నిలువునా కూలిపోయాడు. అదే క్షణంలో పార్థుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు మూర్చపోయాడు. ఈ విషయం గురించి బభ్రువాహనుడి సేనలు తల్లి చిత్రాంగదకు తెలియజేశారు. ఉలూచితో సహా యుద్ధభూమికి వచ్చిన చిత్రాంగద, రథానికి అడ్డంగా పడివున్న కొడుకును, నిర్జీవంగా ఉన్న భర్తను చూసి దుఃఖించింది. సోదరీ! ఈ పసివాడ్ని ఎందుకు యుద్ధానికి ప్రోత్సహించావు? కొడుకు శౌర్యానికి బలైన ఈ కురుకులవరేణ్యుణ్ణి నువ్వు బతికించకపోతే నేను కూడా ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అంటూ చిత్రాంగద పద్మాసనం వేసుకుని కూర్చుంది. కాసేపటికి తేరుకున్న బభ్రువాహనుడు... తండ్రిని చంపిన పాపానికి తానూ ప్రాయోపవేశం చేసి తనువు చాలించాలనుకుని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. వీరితోపాటు ఉలూచి కూడా కన్నీరుపెట్టుకుని, మృత సంజీవనీమణిని తలుచుకుంది. వెంటనే ఆ మణి ఆమె చేతులలోకి రావడంతో దానిని బభ్రువాహనుడికి అందజేసింది. కుమారా! విజయుడికి మరణం ఉంటుందా? నీతో యుద్ధం చేసి నీ పరాక్రమం తెలుసుకోవాలనే కోరిక ఆయనకు ఉంది. అది తీరడానికే ఇంత పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మణిని ఆయన హృదయం మీద పెట్టు అంటూ తన చేతిలో ఉన్న మణిని కొడుక్కి ఇచ్చింది. ఉలూచి వద్ద నుంచి మణిని తీసుకున్న బభ్రువాహనుడు దానిని అర్జునుడి హృదయానికి తాకించగానే నిద్రనుంచి మేలుకున్నట్టు లేచి కూర్చున్నాడు. అనంతరం ఉలూచి మాట్లాడుతూ... శిఖండిని నెపంగా పెట్టుకుని భీష్ముణ్ణి కూల్చారు కాబట్టి అది పాపం.. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా శరీరం విడిస్తే నరకం ప్రాప్తిస్తుంది.. కావాలనే బభ్రువాహనుడిని మీతో యుద్ధానికి ఉసిగొల్పానని, తనను మన్నించమని వేడుకుంది. అంతేకాదు, ఒకరోజు స్నానం చేద్దామని ఆకాశగంగకు వెళ్లిన సమయంలో వసువులంతా అక్కడకు వచ్చారు. వారు ఒక రేవులో స్నానం చేస్తుండగా ఇంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది. తల్లీ.. శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముణ్ణి కూల్చాడు అర్జునుడు, ఇది అన్యాయం కదా?" అన్నారు వసువులు. దీనికి ఆగ్రహించిన గంగాదేవి ‘కన్నకొడుకు చేతిలోనే అర్జునుడు హతమవుగాక!’ అని శపించింది. అక్కడే ఉన్న తాను మా తండ్రికి ఈ విషయం చెప్పాను. ఆయన భయపడుతూ వచ్చి దేవిని ప్రార్థించడంతో ప్రసన్నం చెందింది. అర్జునుడు తన కుమారుడు బభ్రువాహనుడి అస్త్రాల వల్ల మరణిస్తాడు.. అయితే, నాగలోకంలోని మృతసంజీవని మణి వల్ల పునరుజ్జీవితుడు అవుతాడనీ ఉపాయం చెప్పింది. అందువల్లే బభ్రువాహనుణ్ణి మీతో యుద్ధానికి పురికొల్పి, మహాశౌర్యం ఆవహింపజేశానని తెలిపింది. కుమారుడు వల్ల కూలిన మీ దేహాన్ని మృతసంజీవనిమణితో తిరిగి సజీవం చేశానని ఉలూచి చెప్పింది. దీనికి సంతోషించిన అర్జునుడు... ఉలూచి నీ వల్ల మా కులం నిలబడింది.. కులవర్థినివి నువ్వు అని ఆమెపై ప్రశంసలు కురిపించాడు. కొడుకును ఆశీర్వదించి, చిత్రాంగదను దీవించి వారందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు.