సమ్మె విరమణపై టీజేఎంయూ ఆగ్రహం!

SMTV Desk 2019-11-22 13:40:04  

బేషరతుగా సమ్మె విరమణకు సిద్దమంటూ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, జెఏసి నేతలు చేసిన ప్రకటనపై ఒకపక్క సిఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగానే, ఆర్టీసీలో టీజేఎం యూనియన్ ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించడం విశేషం.

టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ ఐకాస చేసిన సమ్మె విరమణ ప్రకటనను ఖండిస్తున్నాము. 47 రోజులుగా సమ్మె చేసి అనేక కష్టానష్టాలను భరించాము. 29 మంది కార్మికులను కోల్పోయాము. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో కార్మికులపై పోలీసు కేసులు నమోదు అయ్యాయి. ఇన్ని సమస్యలను ఎదురీదినది...బేషరతుగా సమ్మె విరమించడానికా?ఒకవేళ బేషరతుగా సమ్మె విరమించదలచుకొంటే ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే విరమించి ఉంటే ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం ఉండేది కాదు కదా? ఇంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేవారు కదా?

అశ్వధామరెడ్డి అసమర్ధుడు కనుకనే అర్ధాంతరంగా సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. సమ్మె విరమణ ప్రకటనలో కనీసం చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకోమని అడగలేదు. ఆర్టీసీ కార్మికులపై నమోదు అయిన పోలీసు కేసుల రద్దు చేయమని అడుగలేదు. ఆర్టీసీ కార్మికులు ఇన్ని కష్టానష్టాలకు ఓర్చి సమ్మె చేస్తే అశ్వధామరెడ్డి ఏకపక్షంగా సమ్మె విరమణ ప్రకటన చేసి ఆర్టీసీ కార్మికులను మోసం చేశారు. ఆయన రెండు మూడు యూనియన్లను మాత్రమే కలుపుకొని ముందుకు సాగుతున్నారు తప్ప అందరినీ కలుపుకుసాగడం లేదు.

ఆయన ప్రకటనను మేము పట్టించుకోబోము. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా ఆర్టీసీని కాపాడుకొనేందుకు సమ్మెను కొనసాగిస్తాము. కార్మికులలో చాలా మంది పేదవాళ్ళే ఉన్నారు. కనుక సిఎం కేసీఆర్‌ ఇకనైనా మానవతా దృక్పదంతో ఆలోచించి చర్చలకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.