వివాదాస్పద నిత్యానందస్వామి విదేశాలకు పారిపోయినట్లు ఊహాగానాలు

SMTV Desk 2019-11-22 13:39:27  

వివాదాస్పద నిత్యానందస్వామి విదేశాలకు పారిపోయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు అహ్మదాబాద్‌లో ఒక ఆశ్రమం ఉంది. దానిలో తమ ఇద్దరు పిల్లలను ఆయన నిర్బందించారని, వారిని విడిపించవలసిందిగా ఒ తల్లితండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆశ్రమంలో ఉన్న వారిని విడిపించి తల్లితండ్రులకు అప్పగించారు.

వారిని ఆశ్రమంలో నిర్బందించినందుకు ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కానీ నిత్యానందస్వామి అక్కడ లేకపోవడంతో గుజరాత్‌ పోలీసులు ఆయనను ప్రశ్నించేందుకు కర్ణాటకలోని బిడిది ఆశ్రమానికి వెళ్ళగా అక్కడా ఆయన లేరు. ఆయన చాలా కాలంగా ఆశ్రమానికి రావడం లేదని ఆశ్రమనిర్వాహకులు చెప్పారు. అయితే వారు నిత్యానందస్వామికి సంబందించి ఎటువంటి సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో పోలీసులకు అనుమానం కలిగి భక్తులను ఆరా తీయగా ఆయన ఎప్పుడో విదేశాలకు పారిపోయినట్లు చెప్పారని సమాచారం.

ఆయనపై వేర్వేరు కోర్టులలో అనేక కేసులు పెండింగులో ఉన్నాయి. వాటికి కూడా ఆయన హాజరుకావడం లేదు. కనుక ఆయన విదేశాలకు పారిపోవచ్చానే అనుమానంతో కర్ణాటక కోర్టు ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకొంది. అయినప్పటికీ ఆయన విదేశాలకు పారిపోవడం నిజమైతే బహుశః నకిలీ పాస్ పోర్టుతో పారిపోయి ఉండవచ్చు.