సమాధిలో ఉన్న శవాన్ని బీమా సంస్థకి తీసుకెళ్ళిన కుటుంబికులు!

SMTV Desk 2019-11-22 13:38:55  

పలు బీమా సంస్థలు వ్యక్తి చనిపోయిన తర్వాత కట్టిన డబ్బుని చెల్లించేందుకు మాత్రం ముప్పుతిప్పలు పెడతాయి. ఆధారాలు కావాలంటూ వేధిస్తాయి. ఓ కుటుంబానికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. చనిపోయాడని చెప్పినా ఆ సంస్థ బీమాను ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో వాళ్లు ఏకంగా పూడ్చిపెట్టిన శవాన్ని సమాధి నుంచి బయటకు తీసి ఆ సంస్థ ఆఫీసులోకి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిఫిసో జస్టిస్ మొలాంగో(46) అనే వ్యక్తి నవంబరు 7న చనిపోయాడు. దీంతో అతడి కుటుంబికులు నొంబెన్‌లే మొలాంగో, దందాజ్ మష్లీలు బీమా సంస్థకు ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఆధారాలు ఉంటేగానీ బీమాను ఇవ్వలేమని ఆ కంపెనీ వెల్లడించింది. ఇందుకు కొద్ది రోజులు వేచి చూడాలంటూ కాలాయాపన చేసింది. నవంబరు 7న మొలాంగోకు అంత్యక్రియలు జరిపి, 11వ తేదీన ‘ఓల్డ్ మ్యూట్యాల్స్’ సంస్థలో బీమా మొత్తాన్ని పొందేందుకు కుటుంబ సభ్యులు వెళ్లారు. ఇందుకు 48 గంటలు పడుతుందని సిబ్బంది తెలిపారు. దీంతో నవంబరు 14న మరోసారి బీమా సంస్థకు వెళ్లారు. దీంతో తర్వాత రోజు రావాలని చెప్పారు. ఆ తర్వాతి రోజు కూడా బీమా సంస్థ నుంచి సానుకూల స్పందన రాలేదు. మూడు గంటలు వేచి చూడాలని కాలాయాపన చేశారు. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు సమాధిలో పాతిపెట్టిన శవపేటిక నుంచి శవాన్ని తీసుకెళ్లి బీమా సంస్థకు తీసుకెళ్లారు. ‘‘ఇతను బతికిలేడు, చనిపోయి వారం రోజులవుతుంది. ఇంతకు మించిన ఆధారాలను మేము తీసుకురాలేం’’ అని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘ఓల్డ్ మ్యూట్యువల్’ సంస్థ స్పందించింది. వారికి బీమా నగదు చెల్లించామని తెలిపింది.