భారతదేశంలో అనుమతి లేని 10 అద్భుతమైన ప్రదేశాలు

SMTV Desk 2019-11-22 13:31:23  

దేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. టూరిజం పట్ల ఆసక్తి ఉన్న దేశ, విదేశీ పర్యాటకులు సరికొత్త పర్యాటక గమ్యస్థానాలను ఇక్కడ అన్వేషించవచ్చు. కొన్ని అందమైన ప్రదేశాలకు మాత్రం ఎంత కష్టపడినా టూరిస్టులు చేరుకోలేరు. అవును.. ఇది నిజం. ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఎంత మాత్రం కాదు. అద్భుతమైన పర్యాటక ఆకర్షణలు ఉన్నా సందర్శనకు నోచుకోని ఆ ప్రదేశాల వివరాలను మీకు తెలియజెసేందుకు మాత్రమే. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏమిటి? ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం రండి.

*అక్సాయ్ చిన్:

టూరిస్టులు సందర్శించేందుకు వీలు కాని ప్రదేశాల్లో అక్సాయ్ చిన్ ఒకటి. చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతం నుంచి భారత ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని వేరు చేసే కాల్పుల విరమణ రేఖ ప్రాంతంలో ఇది ఉంటుంది. తూర్పు భాగంలో ఉన్న ఈ ప్రాంతాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి) అని అంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా కూడా దీనిని పిలుస్తారు. ఈ ఎల్ఏసి లడాఖ్ లోని పాంగోంగ్ ట్సో సరస్సు మీదుగా వెళ్తుంది. అత్యున్నత పర్వత శిఖరాల మధ్య ఉండే ప్రదేశం అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలోని మర్మమైన ప్రదేశాలలో ఒకటిగా, పర్యాటకుల దృష్టికి దూరంగా ఇది ఉంటుంది.

*సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్:

కేరళలోని సుందరమైన ప్రదేశాలలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఒకటి. ఇటీవల ఇక్కడ మావోయిస్టుల దాడి కారణంగా పర్యాటకుల రాకపోకలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకులు పెద్దగా సాహసించడం లేదు. ఉష్ణమండల సతత హరిత అడవులతో, మైమరపించే సహజ సౌందర్యంతో ఉండే ఈ జాతీయ ఉద్యానవనం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది.

*చంబల్ నది:

వర్ణించ సాధ్యం కాని అందాలతో భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటిగా మధ్యప్రదేశ్ లోని చంబల్ నదికి ప్రాముఖ్యత ఉంది. ఎందరో బాలీవుడ్ సినిమా నిర్మాతలు తమ సినిమాలను చిత్రీకరించేందుకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేవారు. అయితే బందిపోటు దొంగల కారణంగా ఈ ప్రాంతం పర్యాటక సందర్శనకు దూరమైంది. ఇక్కడి మనోహరమైన దృశ్యాలను చూసిన వారు ఎప్పటికీ ఆ అనుభవాలను మరచిపోలేరు. కానీ చివరికి నిషేధించబడిన పర్యాటక ప్రదేశంగా ఇది మిగిలిపోయింది.

*మానస్ నేషనల్ పార్క్:

అస్సాంలో ఉన్న మానస్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉగ్రవాద ఘటనలు జరిగిన ప్రదేశాల్లో ఒకటి. 2011లో ఇక్కడ ఆరుగురు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అధికారులను బోడో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దేశంలోని అత్యంత అందమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదుల బెడద వెంటాడుతుంది. ఇక్కడ శాంతిని నెలకొల్పి, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది.

*తురా:

మేఘాలయలో తురా పట్టణం సుందరమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, సున్నపురాయి గుహలు, గిరిజనుల జీవన విధానానికి పెట్టింది పేరు. ఇంత సుందరమైన పర్యాటక ప్రదేశాన్ని ఉగ్రవాదం కలవరపెడుతుంది. ఉగ్రవాద బాధిత ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రాంతం యొక్క అందానికి, దాని దయనీయ స్థితికి ఏ మాత్రం పొంతన ఉండదు. భారత దేశంలోని అత్యంత నిషేధిత ప్రాంతాల్లో ఒకటిగా ఇది గుర్తించబడడంతో పర్యాటకులు ఇక్కడికి వెళ్లే సాహసం చెయ్యరు.

*హఫ్లంగ్:

అస్సాంలోని ఉత్తర కచర్ పర్వతాల (ఎన్ సి హిల్స్) నడిబొడ్డున ఉన్న మనోహరమైన పట్టణం హఫ్లంగ్ . వివిధ ఉగ్రవాద సంస్థల కారణంగా ఇక్కడి పర్యాటక రంగం అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. దీంతో ఈ పర్యాటక ప్రాంతానికి టూరిస్టుల రాకపోకలను నిషేధించారు. పర్యాటకులను ఖచ్చితంగా మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలో ఇది ఒకటి.

*బస్తర్:

ఇండియన్ నయాగరా జలపాతాలు అని పిలుచుకునే చిత్రకూట్ వంటి పర్యాటక ఆకర్షణలు కలిగిన బస్తర్ జిల్లా ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో ఉంది. ప్రకృతి అందాలతో పాటు ప్రమాదకరమైన నక్సలైట్లు కూడా ఇక్కడ ఎక్కువ. బస్తర్ జిల్లా మొత్తం పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలతో నిండి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆ ప్రదేశాలన్నీ ప్రమాదకరమైన రెడ్ కారిడార్ లో ఉన్నాయి.

*ఫుల్బని:

ఒడిశాలోని భువనేశ్వర్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఆకర్షించే జలపాతాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలను కలిగిన ఉన్న చిన్న పట్టణం ఫుల్బని. వీటితో పాటు భారతదేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగానూ దీనికి ప్రాముఖ్యత ఉంది. అందుకే టూరిస్టులకు ఇక్కడికి వెళ్లాలనిపించినా వెళ్లలేని పరిస్థితి ఉంది.

*నికోబార్ ద్వీపం:

అండమాన్ మాదిరిగా నికోబార్ దీవుల్లో పర్యటించేందుకు అవకాశం ఉండదు. ఇక్కడి దట్టమైన అడవులు, బీచ్ లు వర్ణింపలేని విధంగా ఉంటాయి. విదేశీయులు ఈ ద్వీపంలోకి ప్రవేశించాలంటే ప్రత్యేక పాస్ ల అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గిరిజన సమూహాలు ఉండే ప్రదేశాల్లోకి ఎవ్వరినీ అనుమతించరు. పరిశోధనల కోసం వెళ్లేవారు కొన్ని కఠినమైన నియమాల మధ్య ఇక్కడ పర్యటించాల్సి ఉంటుంది. పర్యాటక ఆకర్షణలు ఉన్నా టూరిజంను ఈ ప్రాంతంలో ప్రోత్సహించరు.

*బారెన్ ద్వీపం:

భారతదేశంలో నేటికీ నిప్పులు చిమ్మే అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ యొక్క బారెన్ ద్వీపంలో ఉంది. ఈ అగ్ని పర్వతం చిమ్మే ఎర్రని లావాలను, దట్టమైన పొగను చూడాలంటే కొన్ని భద్రతా ప్రమాణాలతో చిన్న షిప్ లో వెళ్లి నిర్ణీత దూరం నుంచి వీక్షించవచ్చు. ఎలాంటి భద్రత లేకుండా ఈ పర్వతానికి దగ్గరగా వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. పెద్దగా ఉనికిలో లేకపోయినా ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది.