యూట్యూబ్ వినియోగదారులకు షాక్...డిసెంబర్ 10వ నుంచి నో చానల్స్!

SMTV Desk 2019-11-12 14:43:08  

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం అయిన యూట్యూబ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 2019 డిసెంబర్ 10వ తేదీ నుంచి తమకు ఎక్కువగా ఆదాయం అందించని యూట్యూబ్ చానెళ్లను తొలగించాలని యూట్యూబ్ నిర్ణయించింది. అంటే మీరు యూట్యూబ్ లో పెట్టే వీడియోలకు యాడ్ రెవిన్యూ రాకపోతే మీ చానెళ్లు ఇక యూట్యూబ్ లో కనిపించవన్న మాట. యూట్యూబ్ దీనికి సంబంధించిన నిబంధనలను కూడా వివరించింది. మీరు అందించే సేవలు యూట్యూబ్ కి భారంగా మారితే మీ ఖాతాకు సంబంధించిన అనుమతులన్నీ తొలగించే అవకాశం ఉందని అందులో పేర్కొంది. అయితే కేవలం యూట్యూబ్ కి సంబంధించి మాత్రమే కాకుండా గూగుల్ కి సంబంధించిన డేటాను కూడా తొలగిస్తామని తెలిపింది. అంటే జీమెయిల్, డాక్స్, గూగుల్ ఫొటోస్ వంటి సర్వీసులు కూడా ఆయా ఖాతాలకు లభించవు. అయితే ఈ నియమ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి అని నిర్దిష్టంగా తెలియకపోయినా.. యూట్యూబ్ పేర్కొన్న నియమ నిబంధనలను బట్టి చూసినట్లయితే ఇవి యూట్యూబర్లకే అని తెలుసుకోవచ్చు. దీన్ని కేవలం యూట్యూబర్లకే కాకపోయినా సాధారణ వినియోగదారులకు కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. కొంతమంది ఆదాయం ఆశించకుండా తమకు సంబంధించిన కంటెంట్ పది మందికీ చేరాలనే ఉద్దేశంతో వీడియోలు యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు. దీంతో ఇప్పుడు యూట్యూబర్లందరికీ ధనార్జనే తమ ప్రధాన లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై యూట్యూబ్ అధికార ప్రతినిధులు స్పందిస్తూ.. తమ సేవల నిబంధనల్లో పలు మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. తమ నిబంధనలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటామని, ఇది అందులోనే భాగమని తెలిపారు. తమ ఉత్పత్తుల్లో మార్పులు ఉండవన్నారు. అయితే దీనిపై వినియోగదారుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనలు కొత్తగా కంటెంట్ అందించేవారిని నిరాశకు గురి చేస్తామని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి యూట్యూబ్ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో వినియోగదారుల నుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గి కాస్త వెనక్కి తగ్గుతుందో చూడాలి!