బాలికను కిడ్నాప్ చేసి భర్తకు మరో పెళ్లి చేసిన భార్య... కారణం తెలిస్తే షాక్

SMTV Desk 2019-11-11 13:33:37  

తమకు పుట్టిన ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో అబ్బాయి కోసం ఆ జంట తపించింది. ఎలాగైనా వారసుడు కావాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఓ బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ గుడికి తీసుకెళ్లి తన భర్తతో వివాహం జరిపించిందో భార్య. తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. దిట్టకుడి ఉల్లవయ్యంగుడికి చెందిన అశోక్‌కుమార్-చెల్లకిళి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మగపిల్లాడు కావాలన్న కోరిక తీరకపోవడంతో ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. స్థానికంగా నివసించే ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు. ఈ నెల 7న అమ్మాయి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి బాలికను తమతోపాటు ఆలయానికి తీసుకెళ్లారు.

అందరూ కలిసి గుడికి చేరుకున్న తర్వాత చెల్లకిళి తమ ప్లాన్‌ను అమలు చేసింది. తన భర్తతో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది. అయితే, గుడికి వెళ్లిన తమ కుమార్తె మూడు రోజులైనా రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు చెల్లకిళిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె భర్త అశోక్ కుమార్ కోసం గాలిస్తున్నారు.