విలవిలలాడుతున్న పామును మరో పాము కాపాడింది

SMTV Desk 2019-11-06 15:18:20  

రాళ్ల మధ్య ఇరుక్కుని విలవిలలాడుతున్న పామును మరో పాము కాపాడిన ఉదంతమిది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాం సాయివీధిలో పి.వెంకటరాజు ఇంటి ఆవరణలో రాళ్ల మధ్య ఓ పాము చిక్కుకుంది. ఎంత గింజుకున్నా బయటకు రాలేక యాతన అనుభవిస్తూ అలానే పడి ఉంది. విషనాగు కావడంతో దానిని రక్షించేందుకు స్థానికులు సాహసించలేక పోయారు. అంతలో అక్కడికి మరో నాగుపాము వచ్చింది. రాళ్లలో చిక్కుకున్న సర్పం తలను తన నోటిలో ఇముడ్చుకొని, కోరలతో పట్టుకుని సుమారు అరగంటపాటు కొంచెంకొంచెం లాగుతూ చివరికి బయటకు తీసుకువచ్చింది. తర్వాత తన నోటిని తెరిచి పామును వదిలిపెట్టి, రాళ్లపక్కన ఉన్న గోడ కింద కలుగుద్వారా అవతలికి వెళ్లింది. కొంతసేపయ్యాక రెండోపామూ ఆ మార్గంలోనే వెళ్లింది. చుట్టూ జనం మూగినా ఏ మాత్రం భయపడకుండా తోటి సర్పాన్ని కాపాడిన నాగుపాము తెగువను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.