మరో మహిళా తహసీల్దార్‌కు బెదిరింపులు

SMTV Desk 2019-11-06 13:13:23  

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు బుద,గురువారం రెండు రోజుల పాటు విధులను బహిష్కరించనున్నారు. విజయారెడ్డి అంత్యక్రియలు ముగియక మునుపే వరంగల్‌ అర్బన్ జిల్లాలో మరో మహిళా తహసీల్దార్‌ బెదిరింపులు ఎదుర్కోవడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. ఈసారి ఓ గ్రామ సర్పంచే స్వయంగా తహసీల్దార్‌ను బెదిరించడం విశేషం.

జిల్లాలోని వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామ సర్పంచ్ గొదుల రాజిరెడ్డి కొంత కాలం క్రితం సాదా బైనామా ద్వారా కొంత భూమిని కొనుగోలు చేశారు. దానికి పట్టాదార్ పాసుపుస్తకం ఇప్పించాలని తహసీల్దార్‌ రజినికి దరఖాస్తు సమర్పించుకొన్నారు. అదీగాక గ్రామంలో శ్మశానవాటికకు కేటాయించిన భూమి అనువుగా లేనందున వేరే చోట భూమి కేటాయించాలని కోరుతూ మరో వినతి పత్రం ఇచ్చారు. కానీ ఆ రెండు పనులు జరుగకపోవడంతో సోమవారం ఉదయం హన్మకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో గల ఆమె నివాసానికి వెళ్లారు. అప్పుడు ఆమె భర్త ఆఫీసుకు వెళ్ళి కలవమని చెప్పారు. కానీ అప్పటికే చాలా కాలంగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నానని కానీ పని కాకపోవడంతో ఇంటికి వచ్చానని, కనుక ఓసారి రజినీ మాడంతో మాట్లాడి వెళ్లిపోతానని రాజిరెడ్డి అభ్యర్ధించారు. కానీ ఆమె భర్త అంగీకరించకపోవడంతో ఆవేశానికి లోనైన రాజిరెడ్డి ఆయనను తోసుకొని లోపలకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆయన రాజిరెడ్డిని అడ్డుకొని పోలీసులకు ఫోన్‌ చేసి పిలవడంతో వెంటనే వారు వచ్చి రాజిరెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. అనుమతి లేకుండా తహసీల్దార్‌ రజినీ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసినందుకు, ఆమెను, ఆమె భర్తను బెదిరించినందుకు పోలీసులు రాజిరెడ్డిపై కేసు నమోదు చేసారు.