ఐసిస్‌కు కొత్త చీఫ్ హష్మి

SMTV Desk 2019-11-01 15:29:40  

ఇంతకాలం ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్‌ ఉగ్రవాదసంస్థ అధినేత అబూ బకర్ బాగ్దాదీ ఇటీవల అమెరికా సైనికుల చేతికి చిక్కి చనిపోయిన సంగతి తెలిసిందే. కానీ రావణుడి ఒక తలను ఖండిస్తే మళ్ళీ కొత్త తల మొలకెత్తినట్లుగానే బాగ్దాదీ చనిపోగానే అతని స్థానంలో అబూ ఇబ్రహీం అల్‌ హష్మీ అల్ కురైషీ అనే మరో కరడుగట్టిన ఉగ్రవాదిని అధినేతగా నియమించుకొన్నట్లు ఐసిస్‌ సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. గొప్ప పోరాటయోధుడైన హష్మీ నేతృత్వంలో ఐసిస్‌ సభ్యులు అందరూ కలిసికట్టుగా పోరాడుతూ అమెరికా దళాలను తరిమికొడదామని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఐసిస్‌ అధికార ప్రతినిధి పేరిట విడుదల చేసిన ఆ తాజా ఆడియో ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచదేశాలు నిన్ను చూసి నవ్వుకొంటున్నాయని నీకు తెలియదా? రాత్రి పడుకొనేబోయే ముందు ఒక అభిప్రాయం కలిగి, మేల్కొన్నాక వేరే కొత్త అభిప్రాయంతో వ్యవహరించే ఒక ముసలి వ్యక్తి (డోనాల్డ్ ట్రంప్‌) చేతిలో అమెరికా భవిష్యత్‌ ఉంది. అమెరికా, యూరప్ దేశాల ముంగిట్లోకి ఐసిస్‌ వచ్చేసిందని మీకు తెలియదా?కనుక మా అధినేత బాగ్దాదీని చంపేశామని అప్పుడే సంబరపడవద్దు,” అని ఆడియో ప్రకటనలో హెచ్చరించింది.

అమెరికాతో సహా అగ్రరాజ్యాలు ఐసిస్‌ ఉగ్రవాదులను సమూలంగా మట్టుబెట్టడానికి దశాబ్ధాలుగా పోరాడుతున్నప్పటికీ ఐసిస్‌ను పూర్తిగా నిర్మూలించలేకపోయిన మాట వాస్తవం. అయితే వాటి నిరంతరపోరాటాల వలన ఐసిస్‌ ప్రపంచదేశాలకు వ్యాప్తి చెందకుండా చాలావరకు కట్టడి చేయగలిగాయి. అమెరికా నిఘా వర్గాలు అనేక ఏళ్ళపాటు శ్రమించి బాగ్దాదీ జాడను కనిపెట్టి మట్టుబెట్టినట్లే ఇప్పుడు ఐసిస్‌ కొత్త అధినేతగా ఎన్నికైన అబూ ఇబ్రహీం అల్‌ హష్మీ కూడా ఏదో ఓ రోజు అమెరికా సేనల చేతిలో చనిపోవడం ఖాయం. కానీ ఆలోగా ఎంత విధ్వంసం సృష్టిస్తాడనే భయపడవలసి వస్తోంది.