డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం 72 బంతులు

SMTV Desk 2019-10-31 16:01:34  

భారత్‌ తొలిసారి ఈడెన్ గార్డెన్స్‌లో ఆడబోతున్న డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం 72 బంతులు అవసరమవుతాయని బీసీసీఐ నిర్ణయానికి వచ్చింది. ఈ బంతుల్ని తయారు చేయనున్న ఎస్జీకి ఆర్డర్‌ కూడా ఇచ్చింది. అయితే ఇంత తక్కువ సమయంలో వాటిని రూపొందించడం సవాలే. మరోవైపు పిచ్‌ విషయంలో పెద్దగా మార్పులు అవసరం లేనప్పటికీ తేమ ఫ్యాక్టర్‌ ఇప్పుడు కీలకంగా మారుతోంది. దీని కోసం గ్రౌండ్‌ సిబ్బంది పనులు మొదలెట్టారు. వచ్చే నెల 22న టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ టెస్టు కోసం ఎస్జీ గులాబి బంతులను వాడనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇప్పటివరకు ఎస్జీ ఉత్పత్తి చేసిన గులాబి బంతులను మ్యాచ్‌లో ఉపయోగించి పరీక్షించలేదు. కాబట్టి ఎలా ఉంటాయో చూడాలి. గతంలో దులీప్‌ ట్రోఫీలో డేనైట్‌ మ్యాచ్‌లు నిర్వహించినప్పటికీ...వాటిల్లో కూకబురా గులాబీ బంతులను వాడిన విషయం తెలిసిందే. బీసీసీఐ అడిగిన బంతుల్ని వచ్చే వారంలోగా అందిస్తాం. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం ఎర్రబంతిలో కీలకమైన మార్పులు చేశాం. గులాబి బంతి కోసం కూడా అదే స్థాయిలో మార్పులు చేపట్టాలని నిర్ణయించాం.దీని కోసం వివిధ పరిశోధనలు చేసి ఉత్తమ ఫలితాలు రాబడతాం అని ఎస్జీ ప్రతినిధి తెలిపారు. పిచ్‌ పరిస్థితి ఇదీ... మ్యాచ్‌ నిర్వహణలో ఏర్పడే ప్రధాన సమస్యల్లో మంచు ఒకటి. దాన్ని మనం నియంత్రించలేమనే విషయాన్ని మనం గుర్తించాలి.కానీ మంచు ప్రభావాన్ని అడ్డుకోవడానికి కొన్ని అవకాశాలున్నాయి. పిచ్‌పై గడ్డి కాస్త పొడుగ్గా ఉంచి, ఔట్‌ఫీల్డ్‌లో తక్కువగా ఉంచాలి. ఎందుకంటే ఔట్‌ఫీల్డ్‌లో ఎక్కువ గడ్డి ఉంటే ఎక్కువ మంచును ఆకర్షిస్తుంది. మరోవైపు గులాబి బంతి తొందరగా దుమ్ము పడుతుంది. ఈ ఇబ్బంది లేకుండా పిచ్‌పై గడ్డి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. గతంలో ఆడిలైడ్‌లో తొలి డే అండ్‌ నైట్‌ టెస్టుకు పిచ్‌పై 11 మిల్లీమీటర్ల పొడవు గడ్డి ఉంచారు అని క్యూరేటర్‌ దల్జీత్‌ చెప్పాడు.