సీఎం అవ్వాలంటూ అనిల్ కపూర్ కు ఫ్యాన్ రిక్వెస్ట్!

SMTV Desk 2019-10-31 15:58:14  

ప్రముఖ నటుడు అనిల్ కపూర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందుకు కారణం మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులే. దేశ ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. అగ్రనేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా శివసేన మాత్రం మొట్టుదిగడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, శివసేన వేర్వేరుగా గవర్నర్‌ భగత్‌సింగ్ కోష్యారీని కలవడంతో మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే అనిల్ కపూర్ వస్తేనే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అనిల్ కపూర్ సీఎం పేరుతో హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. ‘మహారాష్ట్రలో ప్రభుత్వం నెలకొనేంతవరకు అనిల్ కపూర్‌ను ముఖ్యమంత్రిని చేయండి. 2001లో ఆయన నటించిన ‘నాయక్’ సినిమాలో వన్ డే సీఎం అయ్యారు. ఈ సీన్ అందరికీ నచ్చింది. కాబట్టి మన ప్రభుత్వానికి ఓ పరిష్కారం దొరకే వరకు అనిల్ కపూర్‌ను సీఎం చేయండి. ఏమంటారు దేవేంద్ర ఫడ్నవిస్, ఆదిత్య ఠాక్రే?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇందుకు అనిల్ కపూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘నేను ‘నాయక్’గానే బాగున్నాను’ అంటూ తనకు సినిమాలే కరెక్ట్ అని బదులిచ్చాడు. 2001లో వచ్చిన నాయక్ సినిమాలో రాణీ ముఖర్జీ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ ఒక రోజు సీఎంగా వ్యవహరిస్తారు. శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మరోవైపు, శివసేనకు మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీచేసి, మెజార్టీ సీట్లు సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండేళ్లు పంచుకోవాలని, గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని శివసేన డిమాండ్ చేస్తోంది. బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని శివసేన తీసుకోవాలని కొందరు బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిబేట్ పెట్టారు.