దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

SMTV Desk 2019-10-30 15:21:25  

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 6.6గా నమోదైందని యూఎస్‌ జియోలజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. రాజధాని మనీలా నుంచి 972కిలోమీటర్ల దూరంలో ఉన్న తులునన్‌ నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అన్నారు. భూకంపం కారణంగా ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరికొందరు గాయపడ్డారు. భూప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారని అధికారులు తెలిపారు. తులునన్‌ నగరంలో భారీ ఆస్తినష్టం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలోని అనేక భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు తులునన్‌ మేయర్‌ రియూల్‌ లింబుంగ్వన్‌ తెలిపారు. కాగా, ఈనెల 16న తులునున్‌ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఈ ప్రకృతి విపత్తులో ఏడుగురు మృతిచెందగా, 215 మంది గాయపడ్డారు.