కోర్టులో కేసీఆర్ బండారం బయటపడింది!

SMTV Desk 2019-10-30 15:20:27  

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. హుజూర్‌నగర్‌లో గెలవడం కోసం టీఆర్ఎస్ ఇచ్చిన హామీని.. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముడిపెడుతూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన వాదనను చూస్తుంటే.. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ గారిచ్చే ఏ హామీ కూడా అమలు కాదని స్పష్టంగా అర్థం అవుతోంద’’ని విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం రూ. 47 కోట్లు కూడా లేవని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొనడమే దీనికి నిదర్శనం అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చడానికి రూ. 47 కోట్లు లేనప్పుడు.. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్లతో అభివృద్ధి పథకాలు అమలు చేస్తానని కేసీఆర్ ఎలా ప్రకటించారని హైకోర్టు నిలదీసిందని విజయశాంతి తెలిపారు. కోర్టు వేసిన ప్రశ్నతో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారని రాములమ్మ తెలిపారు. కోర్టు వేసిన ప్రశ్నకు సమాధానంగా.. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి తమ వద్ద తగిన నిధులు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించాలి లేదా.. ఉత్తుత్తి హామీలు ఇచ్చానని చేతులెత్తేయాలని విజయశాంతి లాజికల్‌గా మాట్లాడారు. ఒకవేళ హుజూర్‌నగర్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తే.. ఆర్టీసీ కార్మికులకు కూడా రూ.47 కోట్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు.. సీఎం దొరగారు తన పంతాన్ని నెగ్గించుకునేందుకు.. రూ.100 కోట్ల అభివృద్ధి నిధులు ఇవ్వకుండా హుజూర్‌నగర్ ఓటర్లకు మొండిచేయి చూపిస్తారని అర్థమవుతోందని విజయశాంతి ఆరోపించారు. ఇప్పటి వరకు తాను అపర చాణుక్యుడనని కేసీఆర్ ఫీలవుతూ ఉంటారు. ఇప్పుడు కోర్టు వేసిన గూగ్లితో ఆయన బండారం బయటపడిందని ఎద్దేవా చేశారు.