భారత్‌కు మద్దతు ఇస్తే మిస్సైళ్లతో దాడి చేస్తాం: పాక్ మంత్రి

SMTV Desk 2019-10-30 15:19:12  

పాకిస్థాన్ మంత్రి అలీ అమిన్ గందాపూర్ భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంలో భారత్‌కు మద్దతు ఇచ్చే దేశాలపైన మిస్సైళ్లతో దాడి చేస్తామని హెచ్చరించారు. అటువంటి దేశాలను తమ శత్రువులుగా భావిస్తామన్నారు. ఒకవేళ కశ్మీర్ అంశంలో భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే, అప్పుడు పాక్ యుద్ధానికి వెళ్లుందని, ఆ సందర్భంలో భారత్‌కు మద్దతు ఇచ్చినవారిని శత్రువులుగా భావిస్తామని, ఆ దేశాలపై క్షిపణులతో దాడి చేస్తామని మంత్రి అలీ అమిన్ పేర్కొన్నారు. అయితే ఆ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు తన ట్వీట్‌లో పోస్టు చేశారు. కశ్మీర్ అంశంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు ఎటువంటి మద్దతు లభించడంలేదు. దీంతో ఏకాకిగా మారిన ఆ దేశం తీవ్ర వత్తిడిలో ఉన్నది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ అయోమయస్థితికి చేరుకున్నది. కశ్మీర్ సమస్య అంతర్గతమైనదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.