అతిగా వ్యవహరించవద్దని యోగి ఆదేశం

SMTV Desk 2017-06-03 18:56:07  yogi adityanath, cm up, upcm,

లక్నో, జూన్ 3 : అతిగా వ్యవహరించ వద్దని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భద్రతా సిబ్బంది పై సీరియస్ అయ్యారు. తాను పర్యటించే ప్రాంతాల్లో తన కోసం హంగు, ఆర్భాటాలు చేయవద్దని, ప్రత్యేక ఏర్పాట్లతో హడావుడి సృష్టించవద్దని ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన పర్యటన సమయంలో అధికారులు చేసిన హడావుడి జాతీయ స్థాయి వార్తల్లో వివాదాస్పదంగా మారడం తెలిసిందే. మనం నేలపై కూ ర్చొని ఉండేవాళ్ళమే, అందుకే ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయవద్దు..ముఖ్యమంత్రి అనే గౌరవం ఉంటే చాలు అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. గత నెల బిఎస్ఎఫ్ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వెళ్ళిన సమయంలో ఆ ఇంటిని అధికారులు ఖరీదైన వస్తువులతో నింపడం..ముఖ్యమంత్రి వెళ్ళిపోగానే అధికారులు ఇంట్లో పెట్టిన ఏసీ, సోఫా తదితరాలను తీసేయడం జాతీయ స్థాయి మీడియాను ఆకర్శించి వివాదాస్పదంగా మారింది. అదే విధంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే ప్రజలను స్నానాలుచేసి రావాలంటూ సబ్బులు, షాంపూలు ఇచ్చిన ఘటన సైతం వివాదాన్ని లేవనెత్తుతోంది.