మెట్టు కూడా దిగని శివసేన...గవర్నర్‌తో బీజేపీ, సేన వేర్వేరుగా చర్చలు!

SMTV Desk 2019-10-28 15:21:09  

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన-బిజెపి ఇంకా గందరగోళ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, శివసేన వేర్వేరుగా గవర్నర్‌ భగత్‌సింగ్ కోష్యారీని కలవడంతో మరింత వేడి రాజుకుంది. ముందుగా గవర్నర్‌ను దేవేందర్ ఫడ్నవీస్ కలిశారు. కేవలం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని, ఎలాంటి రాజకీయ అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని ఫడ్నవీస్ తెలిపారు.గవర్నర్‌కు ఏటా దీపావళి శుభాకాంక్షలు తెలియజేడానికి రాజ్‌భవన్‌కు వస్తుంటానని, ఆదివారం ఆయన అందుబాటులో లేకపోవడంతో కుదురలేదని అన్నారు. అందుకే తనకు ఈ రోజు అపాయింట్‌మెంట్ దొరికిందన్నారు. శివసేన ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలిశారు. ఆ పార్టీ నేత దివాకర్‌ రౌత్‌ నేతృత్వంలోని శివసేన ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసింది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రెండు పార్టీలు చెప్పడం విశేషం.మరోవైపు, శివసేనకు మద్దతు పెరుగుతోంది. చిన్న పార్టీలు, రెబల్స్‌గా పోటీచేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసి మద్దతు తెలిపారు. దీంతో శివసేన సంఖ్యాబలం 60కి చేరింది. అమరావతి జిల్లా అచాల్‌పూర్ నుంచి నాలుగోసారి ఎన్నికైన పీజేపీ ఎమ్మెల్యే ఓమ్ ప్రకాశ్ అలియాస్ బచ్చు కడు, మెల్ఘాట్ నుంచి గెలిచిన రాజ్‌కుమార్ పటేల్‌లు ఠాక్రేను శనివారం కలిశారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీచేసి, మెజార్టీ సీట్లు సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండేళ్లు పంచుకోవాలని, గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని శివసేన డిమాండ్ చేస్తోంది. బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని శివసేన తీసుకోవాలని కొందరు బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది.