ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు...మూడో పెళ్ళికోసం మరదలి కిడ్నాప్

SMTV Desk 2019-10-28 15:19:58  

ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నా మరోసారి పెళ్లి చేసుకునేందుకు భార్య చెల్లలినే కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తీ. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన ముఖేశ్‌(పేరు మార్చాం)కు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. రెండో భార్య చెల్లెలు అయిన 15ఏళ్ల బాలిక సెలవుల్లో అక్క ఇంటికి వచ్చేది. ఈ క్రమంలోనే బాలిక కన్నేసిన ముఖేశ్ ఆమెతో చనువుగా మెలిగేవాడు. అక్టోబర్ 17వ తేదీన బాలికతో పాటు తన మూడేళ్ల కొడుకుని తీసుకుని ముఖేశ్ పారిపోయాడు. తన భర్తతో పాటు చెల్లి కూడా కనిపించకుండా పోవడంతో అతడి రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముఖేశ్‌ను మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని షాహాడా గ్రామంలో అదుపులోకి తీసుకుని బాలికతో పాటు మూడేళ్ల బాలుడిని రక్షించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన చెల్లెలిని మూడో పెళ్లి చేసుకునేందుకే ముఖేశ్‌ తీసుకెళ్లిపోయాడని అతడి రెండో భార్య ఆరోపిస్తోంది. ఆమెను తన భర్త వలలో వేసుకుంటున్నాడని గ్రహించలేకపోయానని, చిన్నపిల్ల అని కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడని వాపోయింది. ఇద్దరిని పెళ్లి చేసుకున్నా అతడి బుద్ధి మారలేదని, తన చెల్లి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించిన ముఖేశ్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది.