బాబు-వంశీల మధ్య లేఖలతో రాయబారం....బుజ్జగించేందుకు రంగంలోకి సీనియర్ నేతలు.

SMTV Desk 2019-10-28 15:19:17  

ఎమ్మెల్యే పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాదు, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాపై వెనక్కు తగ్గేలా లేరు. అధినేత చంద్రబాబుకు వంశీ తన రాజీనామా లేఖను పంపారు. ఈ లేఖకు చంద్రబాబు బదులిచ్చారు.. ఇటు వంశీ కూడా మళ్లీ బాబు లేఖకు సమాధానం ఇవ్వగా.. మళ్లీ ఈ లెటర్‌పైనా చంద్రబాబు స్పందించారు. ‘వల్లభనేని వంశీ రెండో లేఖకు చంద్రబాబు బదులిస్తూ.. ‘గతంలో మీరు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. మీ పోరాటాలు పార్టీకి గుర్తున్నాయి. మీ పోరాటాలకు పార్టీతో పాటు నేను కూడా మద్దతిచ్చాను. మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు పార్టీ, నేను మద్దతుగా ఉంటాం. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చించండి. ప్రభుత్వ దుందుడుకు వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదాం’అని చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈసారి వంశీతో చర్చించేందుకు పార్టీ సీనియర్లుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను రంగంలోకి దింపారు. ఇప్పటికే వీరిద్దరూ వంశీని బుజ్జగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా లేఖను వెనక్కు తీసుకోవాలని వల్లభనేనిని చంద్రబాబుతో పాటూ పార్టీ నేతలు కోరుతున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ బుజ్జగింపులతో వంశీ మెత్తబడతారా.. రాజీనామాకే కట్టుబడి ఉంటారా అన్నది చూడాలి. వంశీ గత శనివారం ఉదయం బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిశారు.. అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. దీంతో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరతారని ప్రచారం జరిగింది. దీనికి తోడు వంశీ కూడా దీపావళి తర్వాత పార్టీ మారే అంశంపై క్లారిటీ ఇస్తానన్నారు. కానీ అనూహ్యంగా దీపావళి (ఆదివారం) రోజే తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.