ప్రొడ్యూసర్ తో వివాదంలో రానా...ట్విట్టర్ లో విమర్శలు

SMTV Desk 2019-10-28 15:15:44  

దగ్గుబాటి రానా ఇప్పుడు ఎక్కువగా రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నటివరకు ఆరోగ్యం పాడైందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రానా కూడా ఈ విషయంపై స్పందిస్తూ ప్రత్యేకంగా ఓ ట్వీట్ కూడా చేశాడు. అయితే తాజాగా మరో వివాదం నెలకొంది. తాజాగా దీపావళి సందర్భంగా రానా కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఒకటి రిలీజ్‌ అయ్యింది. 2017లో 1945 పేరుతో ఓ పీరియాడిక్‌ పేట్రియాటిక్‌ సినిమాను ప్రకటించాడు రానా.తరువాత ఇతర సినిమాలతో రానా బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పడిపోయింది. ఆ సినిమాకు సంబందించిన ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఇక ఆగిపోయినట్టే అని భావించారు అంతా. కానీ సడన్‌ గా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ను ఇచ్చారు చిత్రయూనిట్‌. ఈ సినిమా జనవరి 24న రిలీజ్‌ అవుతుందని వెల్లడించారు.ఎస్‌ ఎన్‌ రాజరంజన్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివకుమార్‌దర్శకుడు. తన సినిమాల ప్రమోషన్‌ విషయంలో చాలా యాక్టివ్‌గా ఉండే రానా ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మాత్రం ట్వీట్ చేయలేదు. అంతేకాదు సదరు చిత్ర నిర్మాతపై సంచలన ఆరోపణలు చేశాడు.1945 సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న రానా. `నిర్మాత పారితోషికాల విషయంలో మోసం చేయటంతో సినిమా పూర్తి కాలేదు. దాదాపు సంవత్సర కాలంగా నేను ఈ చిత్రయూనిట్‌ను కనీసం కలవలేదు. మరింత మందిని మోసం చేసిన డబ్బు చేసుకునేందుకు ఇది నిర్మాత ఆడుతున్న నాటకం. ఇలాంటి వారిని నమ్మకండి` అంటూ ట్వీట్ చేశాడు. అయితే రానా తన ట్వీట్‌ను కొద్ది సేపటికి ట్విటర్‌ నుంచి డిలీట్ చేశాడు.అయితే రానా వ్యాఖ్యలపై నిర్మాత కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. `సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందో లేదో నిర్ణయించాల్సింది దర్శకుడు. అయినా సినిమా అసంపూర్తిగా ఉందేమో నిర్ణయించే అవకాశం ప్రేక్షకులకు ఇద్దాం. దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ చేశాం. కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పూర్తికాని సినిమాను ఎవరూ రిలీజ్‌ చేయరు` అంటూ రిప్లై ఇచ్చాడు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన రానా ప్రస్తుతం షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నబహుభాషా చిత్రం హాథీమేరి సాథీ సినిమాను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు వెంకీ ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాను కూడా రానా పూర్తి చేయాల్సి ఉంది.