మళ్ళీ అంతరిక్ష ప్రయోగాలకు సిద్దమవుతున్న ఇస్రో

SMTV Desk 2019-10-25 14:38:33  

చంద్రయాన్-2 ప్రయోగం విఫలమవడంతో తీవ్ర నిరాశకు గురైన ఇస్రో శాస్త్రవేత్తలు ఆ షాక్ నుంచి తేరుకొని మళ్ళీ ఉపగ్రహ ప్రయోగాలకు సిద్దం అవుతున్నారు. ఈ ఏడాది చివరిలోగా మొత్తం 17 చిన్న చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు చురుకుగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. విశేషమేమిటంటే వాటిలో 14 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవే కావడం. వాటితో పాటు భారత్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను కూడా పంపిస్తున్నారు. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఏడాది డిసెంబర్ 22 వ తేదీలోగా వాటిని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో భారీగా ఆదాయం సమకూర్చుకోంటోంది. తద్వారా ఇస్రో తన ప్రయోగాలకు నిధుల కోసం కేంద్రప్రభుత్వంపై ఆధారపడకుండా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.