ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు దీపావళి కానుక!!

SMTV Desk 2019-10-18 16:43:14  

ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటు పెంపునకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రయోజనాలు అందుతున్నాయి. దీపావళి పర్వదినానికి ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయింది. పీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ వచ్చింది. వ‌డ్డీ రేటును 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెంచుతూ ప్ర‌భుత్వం గత నెల ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ లో కానీ, ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కానీ పీఎఫ్ బ్యాలెన్స్‌ వివరాలను తెలుసుకోవ‌చ్చు. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ www.epfindia.gov.in కు లాగిన్ అయి, ఎడ‌మ వైపు ఉండే అవ‌ర్ స‌ర్వీసెస్‌ పై క్లిక్ చేయాలి. అనంతరం ఫ‌ర్ ఎంప్లాయిస్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నెంబ‌ర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేసిన తర్వాత యూఏఎన్ నెంబ‌రు, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి. దీంతో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే, మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 77382 99899 కు ఎస్ఎమ్ఎస్ పంపినా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.