మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటున్న ఎన్నారైలు!!

SMTV Desk 2019-10-15 11:22:50  

మరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఏపీఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనం ప్రాజెక్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇందులో ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నవారు తమ డబ్బు వెనక్కు తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటం, రాజధాని నిర్మాణంలో స్తబ్దత నెలకొనడంతో బుకింగ్‌లు రద్దు చేసుకోవడానికే పలువురు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

ఈ ఐకానిక్‌ భవనాన్ని అద్భుతంగా నిర్మించేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ప్రణాళిక రూపొందించింది. సుమారు 6ఎకరాల్లో హైరైజ్‌ టవర్‌ను గ్లోబ్‌ ఆకారంలో ఉండేలా డిజైన్‌ కూడా తయారు చేయించారు. 33వ అంతస్థులో రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ ను ఏర్పాటుచేసేలా ప్రణాళిక రూపొందించారు. అటు వాణిజ్యపరంగాను, ఇటు నివాసపరంగానూ ప్రణాళిక సిద్ధమైంది. ఇది పలు ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారుతుందని, వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.

తెలుగు ప్రవాసులు తమ ఐటీ కంపెనీలను ఇక్కడ ప్రారంభించడానికి అవకాశం ఉండడంతో పాటు నివాసంగా కూడా ఉపయోగించుకునే వెసులుబాటు ఇవ్వడంతో చాలామంది దీనిపై ఆసక్తి కనబర్చారు. ఈ ప్రాజెక్టు రాజధాని అమరావతిలో ఉండడం అదనపు ఆకర్షణగా మారింది. చదరపు అడుగు ధర రూ.5,500 నిర్ణయించినా బుకింగ్‌ ప్రారంభించిన రోజే మొత్తం 104 ఫ్లాట్లు అయిపోయాయి. అడ్వాన్సుగా ఒక్కొక్కరు సుమారు రూ.32 లక్షలు చెల్లించారు. ఈ బుకింగ్‌ల రూపంలో దాదాపు రూ.33 కోట్లు ఏపీఎన్నార్టీ సొసైటీకి సమకూరింది. ఐకానిక్‌ భవనానికి దాదాపు ఏడాది క్రితం శంకుస్థాపన చేశారు.

గత ఫిబ్రవరి నుంచి ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెడతామని పేర్కొన్నా ఎన్నికల సమయం కావడంతో పనులు సాగలేదు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా పనుల్లో అతీగతీ లేకపోవడంతో ఫ్లాట్లు బుకింగ్‌ చేసుకున్న ఎన్‌ఆర్‌ఐలు తమ డబ్బు ఇచ్చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. అయితే అడ్వాన్సుగా కట్టిన మొత్తంతో పాటు ఇంకో వాయిదా చెల్లిస్తే నిర్మాణం ప్రారంభిస్తామని ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ చెబుతున్నట్లు సమాచారం.