మీడియాకు చెప్పి ఎవరికీ చెప్పొద్దన్న ప్రధాని కార్యాలయం

SMTV Desk 2019-10-15 11:21:27  

‘మీడియా సమావేశాల్లో ఎదురయ్యే ప్రశ్నలకు ఇలా సమాధానాలివ్వండి’ అంటూ తమకు వచ్చిన మెసేజ్‌లు ఆస్ట్రేలియాలోని జర్నలిస్టులను అయోమయంలో పడేశాయి. అదీ వచ్చింది ప్రధాని కార్యాలయం నుంచి కావడంతో వారికి ఏదో అనుమానం కలిగింది. అంతే జర్నలిస్టులకు ఉండే సహజమైన ఉత్సుకతతో విషయాన్ని బయటకులాగారు. తీరా పూర్తిగా విషయం తెలిశాక పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియాలో మరి కొద్ది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార, మిత్రపక్ష సభ్యులను సిద్ధం చేసేందుకు పీఎంవో రెడీ అయింది. దీని కోసం కొన్ని రహస్య నివేదికలను సిద్ధం చేసింది. పర్యావరణ పరిరక్షణ, శరాణార్థులు, పన్నులు తదితర అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి కీలక సమచారం వాటిలో ఉంది.


ముఖ్యంగా జర్నలిస్టులు అడిగే కఠిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలివ్వాలనే విషయంపై సభ్యులకు ఈ నివేదికల్లో పలు సూచనలు ఉన్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తరువాతే అసలు ట్విస్ట్ బయటపడింది. సభ్యులకు పంపాల్సిన డాక్యుమెంట్లను పీఎంఓ సిబ్బంది పొరపాటున మీడియా సంస్థలకు పంపించారు. ఈ ఉదంతం ప్రస్తుతం ఇక్కడి మీడియా వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామంపై స్పందించిన అటార్నీ జనరల్ క్రిస్టియన్ పార్టర్.. ఇది చాలా చిన్న విషయం అంటూ కొట్టిపారేశారు. ఆధునిక రాజకీయాల్లో ఇటువంటివి సహజమేనని ముక్తాయించారు.