తెలంగాణ బంద్ కు జనసేన సంపూర్ణ మద్దతు!!

SMTV Desk 2019-10-14 14:33:10  

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ ఇప్పటికే సంపూర్ణ మద్దతును పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో జనసేన మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల యూనియన్ల జేఏసీ నిర్ణయం మేరకు ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాలని జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా హింసకు తావు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించారు. హైదరాబాదులోని జనసేన కార్యాలయంలో తెలంగాణ పార్టీ నేతలతో ఆర్టీసీ సమ్మెపై పవన్ కల్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం అనంతరం ఆయన మాట్లాడుతూ, బంద్ కు సంఘీభావం ప్రకటించారు.

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చిందని పవన్ అన్నారు. ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడటం సమ్మె తీవ్రతను తెలియజేస్తోందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఎంత వరకు ఆమోదయోగ్యం అనే అంశాన్ని పక్కన పెట్టి, వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. ఒకేసారి 48 వేల మంది కార్మికుల ఉద్యోగాలను తొలగించడం తనకు ఎంతో ఆవేదనను కలిగిస్తోందని చెప్పారు. ఒకేసారి ఇంత మందిని తొలగిస్తామనడం ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని అన్నారు.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్స్ లో కొన్ని నెరవేర్చగలిగినవి ఉంటాయని, కొన్ని నెరవేర్చలేనివి ఉంటాయని... ప్రభుత్వం వారిని కూర్చోబెట్టి పరిష్కరించగలిగినవాటిని పరిష్కరించడంతో పాటు, మిగిలిన అంశాలపై నచ్చజెప్పాలని పవన్ సూచించారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పడం కార్మికులను అభద్రతా భావానికి గురిచేసిందని చెప్పారు. సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితిని తీసుకురావద్దని ప్రభుత్వాన్ని కోరారు.