తొలిటెస్టులో ఓపెనర్ల వీరంగం...రోహిత్ సెంచరీ, మయాంక్...!

SMTV Desk 2019-10-02 15:23:34  

భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త అధ్యాయం ప్రారంభించిన రోహిత్ ఇందులో సఫలమయ్యాడు అని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం వేదికగా బుధవారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ బాది ఇంకా క్రీజులోనే కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ మయంక్ అగర్వాల్ కూడా నిలకడగా ఆడుతూ అర్థ సెంచరీ నమోదు చేసి సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ టూర్‌లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై వేటు వేసిన సెలక్టర్లు రోహిత్ శర్మకి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. అయితే.. గత వారం దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ శర్మ.. వైజాగ్‌ టెస్టులో ఎలా ఆడతాడో..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కానీ.. టీ20, వన్డేల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న రోహిత్ శర్మ.. ఈరోజు చెలరేగిపోయాడు. ముఖ్యంగా.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ భారీ షాట్లు ఆడిన రోహిత్ శర్మ.. రబాడ బౌలింగ్‌లో వరుస ఫుల్‌షాట్స్‌తో అదరగొట్టాడు.