టీఆర్ఎస్... సీపీఐ దోస్త్... కెసిఆర్ వ్యూహమేనా ..

SMTV Desk 2019-10-01 15:10:46  

హుజూర్ నగర్ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియగా... 119 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేవారు. ఇక ఈ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగాలని ముందుగా డిసైడ్ అయింది... ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేదా మద్దతు అవసరం లేదని భావించిన టీఆర్ఎస్... తమ అభ్యర్ధిగా సైదిరెడ్డిని ప్రకటించింది. పార్టీ ముఖ్యనేతలు కూడా హుజూర్ నగర్ చేరుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు సీపీఎం, టీడీపీ, బీజేపీ సొంతంగా అభ్యర్థులను బరిలోకి దింపాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 వేలకు పైగా ఓట్ల తేడాతో హుజూర్‌నగర్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించుకున్న టీఆర్ఎస్... ఈ సారి ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోకూడదని వ్యూహరచన చేస్తోంది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుకు 5 వేల ఓట్లు పడడం... 7 వేల పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడంపై విశ్లేషించుకున్న టీఆర్ఎస్... సీపీఐకి స్నేహహస్తం అందించాలనే నిర్ణయానికి వచ్చింది.

గులాబి పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో సీపీఐకి నియెజకవర్గంలో రెండు శాతం ఓట్లు ఉన్నట్టు తేలిందని తెలుస్తోంది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐకి ఆ నియెజకవర్గంలో దాదాపు 10 వేలకు పైగా ఓట్లు వచ్చాయి... దాంతో ఆ పార్టీ తమకు మద్దతు ఇస్తే... హుజూర్ నగర్‌లో గులాబి జెండా ఎగరడం ఖాయమన్నది టీఆర్ఎస్ అలోచనగా కనిపిస్తోంది. సీపీఐ మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు కేకే, నామా నాగేశ్వరరావు, వినోద్ కుమార్‌లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో చర్చలు జరిపారు... బై ఎలక్షన్ లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేద్దామన్న ప్రతిపాదనను కూడా ఉంచినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ తీరుతో అసహనంగా ఉన్న సీపీఐ... టీఆర్ఎస్‌తో కలిసి వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం... అయితే, సీపీఐ అధికారికంగా దీనిపై ప్రకటించాల్సి ఉంది. ఇక, రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది... అందులో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ ప్రాతినిధ్యం వహించిన నియెజకవర్గం కాబట్టి ... అక్కడ పాగా వేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చన్నది గులాబీ పార్టీ ఆలోచనగా ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై కూడా ఉంటుందని భావిస్తున్నారట.