అండగా ఉండాల్సిన సమయంలో సింధు కోచ్ రాజీనామా.....కారణం ఏమిటి?

SMTV Desk 2019-09-24 15:04:42  

ప్రపంచ బ్యాడ్మింటోన్ చాంపియన్ షిప్ టైటిల్ ను భారత టాప్ సీడ్ షట్లర్ పీ వీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. కిమ్ జి హ్యున్ వ్యక్తిగత కారణాలతో తన పదవి నుండి తప్పుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది కన్నా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో సింధు కోచ్‌ రాజీనామా చేయడం ఆమెకు పెద్ద లోటే అని అందరూ భావిస్తున్నారు.

కిమ్ జి హ్యున్ భర్త కొద్ది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అందింది. ఆయనకు న్యూజిలాండ్‌లో కీలక సర్జరీ కావడంతో ఆరు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ ఆరు నెలలు తన భర్తను దగ్గరుండి చూసుకునేందుకు హ్యున్ వెళ్లారు. ఆమె మళ్లీ వచ్చే అవకాశం లేకపోవడంతో.. తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కిమ్ జి హ్యూన్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్. 1994 హిరోషియా ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. మాజీ వరల్డ్ నంబర్ 2 సుంగ్ జీ-హ్యూన్‌కు కూడా కోచింగ్ ఇచ్చారు.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో కిమ్ జి హ్యున్‌ను భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌గా నియమించింది. కోచ్‌గా ఆమె కేవలం నాలుగు నెలలు మాత్రమే సేవలందించారు. గత నాలుగు నెలలుగా ఆమె పీవీ సింధుకు శిక్షణ ఇచ్చారు. వరల్డ్ నంబర్ 5 బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఉన్న సింధు గత నెల స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడంతో హ్యున్ ముఖ్య భూమిక పోషించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరతో జరిగిన ఫైనల్‌లో 21-7, 21-7 తేడాతో విజయం సాధించి సింధు స్వర్ణాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇంతకుముందు ఓ ఇంటర్యూలో కిమ్ జి హ్యూన్ మాట్లాడుతూ... నేను ఇక్కడికి డబ్బు సంపాదించడానికి రాలేదు, ఛాంపియన్లను తయారు చేస్తా. నేను ఇక్కడ నా జాబ్‌ను ఎంజాయ్ చేయలేకపోతే (స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా-గోపీ చంద్ బ్యాడ్మింటన్ అకాడమీ) రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను. నా పర్యవేక్షణలో సింధు వరల్డ్ ఛాంపియన్‌షి‌ఫ్‌లో స్వర్ణం నెగ్గడంతో ఆకాశంలో విహరిస్తున్నా. శారీరక, మానసిక, నైపుణ్యాలను ఎప్పటిలాగే మెరుగుపరచడానికి సింధు పట్ల నా ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంటుంది. ఒలింపిక్స్ నేపథ్యంలో రిలాక్స్ అవడం కుదరదు అని అన్నారు.