ఎస్సైనే చంపబోయిన దొంగలు

SMTV Desk 2019-09-24 14:58:05  

దుండిగల్ ఎస్సై శేఖర్‌ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి పోలీసు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఓ నగల దుకాణం వద్ద ఓ వ్యాన్‌ అనుమానాస్పదంగా నిలిచి ఉండడాన్ని గమనించి, తమ వాహనాన్ని నిలిపేసి వ్యాన్ వైపు కదిలారు. పోలీసులు వస్తున్నారని గమనించిన దొంగలు.. వ్యాన్‌తో వేగంగా ముందుకు దూసుకొచ్చారు. అడ్డుకోబోయిన ఎస్సై శేఖర్‌ రెడ్డిని ఢీకొట్టాలని చూశారు. ప్రమాదాన్ని గ్రహించిన ఎస్సై చాకచక్యంగా వ్యవహరించి వెంటనే పక్కకు జరిగి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం తమ వాహనంలో దొంగలను వెంబడించారు. దొంగలు వాహనాన్ని దూలపల్లి అడవుల్లోకి మళ్లించి అక్కడే వదిలేసి పరారయ్యారు. వ్యాన్, కట్టర్‌, షెటర్‌ తెరిచేందుకు ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీన పరచుకున్నారు. పట్టుబడిన వ్యాన్ కొద్ది రోజుల కిందట అల్వాల్‌లో చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.