హ్యూస్టన్‌ టు హైదరాబాద్‌...... న్యూ జర్సీ టు న్యూ ఢిల్లీ!!

SMTV Desk 2019-09-23 17:55:56  

హ్యూస్టన్‌: ఎన్‌ఆర్‌జీ స్టేడియంలోకి రాత్రి 10.30 గంటల సమయంలో(భారత కాలమానం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్టేడియంలోకి వచ్చారు. అనంతరం మోదీ, ట్రంప్‌ కలిసి వేదిక పైకి వచ్చారు. వస్తూనే స్నేహితుడిలా ట్రంప్‌ చేతిని మోదీ పైకి లేపి ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆ తరువాత త్రివర్ణ వస్త్రధారణలో ఉన్న బాలబాలికలు భారత జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మోదీ గుడ్‌ మార్నింగ్‌ హ్యూస్టన్, గుడ్‌ మార్నింగ్‌ టెక్సస్, గుడ్‌ మార్నింగ్‌ అమెరికా.. గుడ్‌ ఈవినింగ్‌ భారత్‌ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన తొలి ప్రసంగం(ట్రంప్‌ ప్రసంగించిన తరువాత మోదీ మరోసారి ప్రసంగించారు)లో ట్రంప్‌ను మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. తదుపరి ఎన్నికల్లోనూ ట్రంప్‌ విజయభేరీ మోగిస్తారని జోస్యం చెప్పారు.

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.

‘‘ఈ రోజు మనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. పరిచయం అక్కర్లేని పేరు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతీ రాజకీయ చర్చలోనూ ఏదో ఒక సందర్భంలో ప్రస్తావనకు వచ్చే పేరు.. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆయనకు స్వాగతం పలకడం గౌరవంగా భావిస్తున్నాను. ట్రంప్‌ నాకు మంచి మిత్రుడు. అమెరికా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే చెబుతున్నా.. అబ్‌ కీ బార్‌.. ట్రంప్‌ కీ సర్కార్‌ (మళ్లీ ట్రంప్‌ ప్రభుత్వమే). ఈ కార్యక్రమం రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అనుబంధానికి తార్కాణం.

హ్యూస్టన్‌ నుంచి హైదరాబాద్‌ వరకు, బోస్టన్‌ నుంచి బెంగళూరు వరకు, షికాగో నుంచి షిమ్లా వరకు, లాస్‌ ఏంజెలిస్‌ నుంచి లూధియానా వరకు, న్యూజెర్సీ నుంచి న్యూఢిల్లీ వరకు ఈ అనుబంధం పెనవేసుకుని ఉంది. నేను మొదటిసారి వైట్‌హౌజ్‌కు వచ్చినప్పుడు మీరు(ట్రంప్‌) నాకు మీ కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఇప్పుడు నేను మీకు నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. ఎదురుగా ఉందే(స్టేడియంలోని ప్రజలను చూపిస్తూ).. అదే నా కుటుంబం. 130 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. మీకు(స్టేడియంలోని వారికి) భారత్‌కు అత్యంత గొప్ప మిత్రుడిని పరిచయం చేస్తాను. ఈయనే ది గ్రేట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌’’ అంటూ పరిచయం చేశారు.