విశాఖలో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు

SMTV Desk 2019-09-23 17:55:10  

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో భారత్‌ విజయం సాధించింది. ఇక మూడో టీ20లో సఫారీలు ఘన విజయం సాధించడంతో సిరీస్‌ 1-1తో సమం అయ్యింది. మూడో టీ20లో బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయిన విరాట్‌ గ్యాంగ్‌.. బౌలింగ్‌లో కూడా ఆకట్టుకోలేదు. కేవలం ఒక వికెట్‌ మాత్రమే భారత్‌ తీసింది. దాంతో దక్షిణాఫ్రికా జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌ను సమం చేసిన ఉత్సాహంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు విశాఖ నగరానికి చేరుకుంది. సఫారీ జట్టుతో పాటు బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టు కూడా నగరంలో అడుగుపెట్టింది. గురువారం నుంచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి వీసీఏ-ఏడీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు. వీరికి అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ తర్వాత భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖలో తొలి టెస్టు జరుగనుంది. అక్టోబర్‌ 2వ తేదీన ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుంది.