విహార యాత్రలో విషాదం... !!

SMTV Desk 2019-09-16 11:50:05  

జీవితంలో ఏదో సాధించాలని కలలుగన్నారు. ఒక్కోమెట్టు పైకెక్కుతూ ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశపడ్డారు. అనుకున్న విధంగానే తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఏఈఈలుగా ఉద్యోగాలు సాధించారు. తొలి జీతం తీసుకున్నాక విహార యాత్రకని బయలుదేరి గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. గ్రామస్థుల కథనం మేరకు...మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య (22), కర్ణమామిడికి చెందిన బొడ్డు లక్ష్మణ్‌ (23)లు ఇటీవలే తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు సాధించారు.

రమ్య తండ్రి సుదర్శన్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ కావడంతో ఆమె ఆ శాఖలో ఉద్యోగం సాధించాలని కలలు కన్నది. అనుకున్నట్టే కష్టపడి చదివి ఉద్యోగాన్ని సాధించింది. తొలి వేతనం తీసుకున్నాక వినాయక ఉత్సవాల్లో పాల్గొని నిమజ్జనం రోజు సందడి చేసింది. లాంచి ఎక్కి గోదావరిలో ప్రయాణిస్తూ పాపికొండల అందాలు వీక్షించాలని స్నేహితులతో కలిసి బయలుదేరి ప్రమాదంలో చిక్కుకుంది.

బొడ్డు లక్ష్మణ్‌ తండ్రి రామయ్య సింగరేణిలో ఉద్యోగం చేస్తూ పదేళ్ల క్రితం మృతి చెందారు. అనంతరం కుటుంబ పరంగా ఎదురైన ఒడిదుడుకులను గుర్తించి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి చదివి ఏఈఈ అయ్యారు. ఇతను కూడా స్నేహితులతో కలిసి పాపికొండలకు వెళ్లి గల్లంతయ్యారు. జీవితంలో ఏదో సాధించాలనుకుని లక్ష్యం దిశగా సాగిపోతున్న వారి జీవితాలు ఇలా కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరు మంటున్నారు.