మళ్లీ పెరోల్ అడిగిన నళిని.... తిరస్కరించిన కోర్టు!!

SMTV Desk 2019-09-13 13:06:04  

తన కుమార్తె వివాహం ఇంకా నిశ్చయం కాలేదని చెబుతూ, రెండోసారి పెరోల్ పొడిగింపు పొందిన రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి నళినికి మూడోసారి మాత్రం చుక్కెదురైంది. నళిని పెరోల్ ను మరోమారు పొడిగించాలంటూ, ఆమె తరఫున దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎం నిర్మల్ కుమార్ ల ధర్మాసనం ససేమిరా అంది. ఈ సంవత్సరం జూలైలో కుమార్తె పెళ్లి నిమిత్తం ఆమెకు నెల రోజుల పెరోల్ లభించగా, అదే నెల 25న బాహ్య ప్రపంచంలోకి వచ్చిన నళిని, వేలూరులో ఉంటూ కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఆ పెరోల్ ఆగస్టు 24తో ముగిసే వేళ, వివాహం ఇంకా నిశ్చయం కానందున మరో నెల రోజులు పెరోల్ కావాలని ఆమె కోరింది. మానవతా దృక్పథంతో కేసును పరిశీలించి, మరో మూడు వారాలు పెరోల్ ఇస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. ఈ గడువు ఈ నెల 15తో ముగియనుంది. ఇంకా పెళ్లి ఏర్పాట్లు పూర్తి కాలేదని, మరో నెల రోజులు తాను బయట ఉండే అవకాశం కల్పించాలని ఆమె, ఇంకోసారి కోర్టు మెట్లెక్కగా, ఆ పిటిషన్ ను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. 15వ తేదీ సాయంత్రం 6 గంటల కల్లా వేలూరు జైలుకు ఆమె వెళ్లాల్సిందేనని న్యాయమూర్తులు ఆదేశించడం గమనార్హం.