సగం కంటే తక్కువ ధరకే వస్తువులు!!

SMTV Desk 2019-09-09 11:42:15  

అత్యాశకు పోయే వారు ఉన్నన్నాళ్లు మోసం చేసే వారూ వెంటే ఉంటారు అనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ. నిత్యం ఆన్‌లైన్‌ మోసాలు వెలుగు చూస్తున్నా సగం కంటే తక్కువ ధరకే ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ అమ్ముతున్నామన్న కొందరు కేటుగాళ్ల మాటలు నమ్మి వందలాది మంది వినియోగదారులు దాదాపు రూ.3 కోట్లు పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌ బేగంపేట ప్రకాష్‌నగర్‌లో ‘హిమోగల్‌ టెక్నాజీ’ పేరుతో జులై 29న ఓ సంస్థ వెలిసింది. నిర్వాహకులు మహ్మద్‌ తస్లీమ్‌, ఆదిత్యలు కాల్‌సెంటర్‌ మార్కెటింగ్‌ పేరుతో 90 మందిని నియమించుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కాల్‌సెంటర్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ పనులుంటాయని తెలపడంతో ఉద్యోగులంతా ఆశతో చేరారు. తీరా చేరాక ఆన్‌లైన్‌లో వస్తువులు విక్రయం బాధ్యతను అప్పగించారు.

ముందు సంస్థ ఉద్యోగుల కోసం అంటూ 70 శాతం డిస్కౌంట్‌ ప్రకటించారు. దీంతో పనిచేస్తున్న వారంతా ఆశపడి ఫ్రిడ్జ్‌లు, టెలివిజన్లు, వాషింగ్‌మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు ఆర్డర్‌ ఇచ్చారు. అనంతరం కస్టమర్ల కోసం అంటూ 55 శాతం డిస్కౌంట్‌ ప్రకటించారు. ఇందుకోసం ‘వాప్‌ జి ఆప్స్‌’ పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. సగం కంటే తక్కువ ధరకే వస్తువులు వస్తున్నాయన్న ఆశతో నెల రోజుల్లో 1500 మంది ఆర్డర్‌ చేశారు.

ఆన్‌లైన్‌లో పేమెంట్‌ పూర్తి చేశారు. ఇలా ఆర్డర్‌ చేసిన వారిలో చిన్నచిన్న వస్తువులు బుక్‌ చేసిన వంద మంది వరకు కస్టమర్లకు వాటిని అందించారు. పెద్ద వస్తువులు మాత్రం రాలేదు. బుక్‌చేసి ఇన్నిరోజులైనా వస్తువులు రాకపోవడంతో కస్టమర్లు సంస్థ ఉద్యోగులపై ఒత్తిడి పెంచారు.

ఈలోగా నిర్వాహకులు బోర్డు తిప్పేసి జారుకున్నారు. తాము మోసపోయామని గుర్తించిన ఉద్యోగులు నిన్న బేగంపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు నిర్వాహకుల్లో ఒకడైన తస్లీమ్‌ను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న ఆదిత్య కోసం గాలిస్తున్నారు.