ధోని రికార్డులను వెంటాడుతున్న కోహ్లీ

SMTV Desk 2019-08-30 12:47:25  

భారత జట్టు సారథి విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. తాజాగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన సారథిగా మహ్రేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారంనుంచి వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్టులో గనుక విజయం సాధిస్తే అత్యధిక మ్యాచ్‌లను గెలిపించిన సారథిగా కోహ్లీ ముందు వరసలో నిలుస్తాడు. ధోనీ 60 టెస్టులాడి 27 మ్యాచ్‌లలో గెలిపించాడు. మరో 15 మ్యాచ్‌లను డ్రాలుగా ముగించాడు.18 మ్యాచ్‌లలో జట్టు ఓడిపోయింది. కోహ్లీ 47 టెస్టు మ్యాచ్‌లు ఆడి 27 మ్యాచ్‌లను గెలిపించాడు. 10 మ్యాచ్‌లు ఓడిపోగా మరో 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అంతకు ముందు సౌరబ్ గంగూలీ సారథ్యంలో49 టెస్టులు ఆడగా అందులో 21 టెసుల్లో టీమిండియా విజయం సాధించింది.ఇక విదేశాల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన సారథిగా కూడా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా విదేశాల్లో 20 టెస్టుమ్యాచ్‌లు ఆడగా అందులో 12 మ్యాచ్‌లు గెలిచింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో విజయం సాధించి మాజీ సారథి గంగూలీ రికార్డు (28 మ్యాచ్‌ల్లో 11 విజయాలు)ను కోహ్లీ దాటేశాడు. టీమిండియా, విడీస్‌ల మధ్య రెండో టెస్టు శుక్రవారంనుంచి ప్రారంభం కానుంది.