ఐసీఐసీఐ బ్యాంకులో రోబోలు

SMTV Desk 2019-08-30 12:46:54  

ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా వినూత్నమైన సేవలు ప్రారంభించింది. బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం రోబోలను ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఖజానాలోని నోట్లను లెక్కించేందుకు, వాటిని సర్దడానికి ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్స్‌ను వినియోగిస్తోంది. ఈ సేవలు బుధవారం నుంచి ప్రారంభించింది. ముంబై, మహరాష్ట్ర, న్యూ ఢిల్లీ, బెంగళూరు, మంగళూరు, జైపూర్, హైదరాబాద్, చండీగఢ్, బోఫాల్, రాయ్‌పూర్, సిలిగురి, వారణాసి ప్రాంతాల్లోని బ్యాంక్ ఖజానాల్లో రోబోలు కరెన్సీ నోట్లను లెక్కిస్తున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ (ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్) అనుభూతి సంఘాయ్‌ తెలిపారు. 12 ప్రాంతాల్లోని 14 మెషీన్లు (రోబోటిక్ ఆర్మ్స్) వార్షికంగా 180 కోట్ల కరెన్సీ నోట్లను లెక్కిస్తాయని అనుభూతి తెలిపారు. అన్ని పనిదినాల్లోనూ ఇవి పనిచేస్తాయని పేర్కొన్నారు. దీంతో బ్యాంక్ కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. ‘రోబోలు ఎంత పెద్ద మొత్తంలోని నోట్లను అయినా ఎలాంటి అలసటా లేకుండా లెక్కిస్తాయి. పనిని కచ్చితంగా, వేగంగా పూర్తి చేస్తాయి. దీంతో ఈ పని చేసే బ్యాంక్ ఉద్యోగులు ఇతర వ్యాల్యూ యాడెడ్ సేవలపై దృష్టి కేంద్రీకరిస్తారు’ అని ఆమె తెలిపారు. భారత్‌లో ఇలాంటి సేవలు ఆవిష్కరించిన తొలి వాణిజ్య బ్యాంక్ ఇదే. ప్రపంచంలో కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే ఇలాంటి సర్వీసులు కలిగి ఉన్నాయి. ‘రోబోటిక్ ఆర్మ్స్ సెన్సర్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవి సెకన్‌లో దాదాపు 70 పారామీటర్లను చెక్ చేస్తాయి. ఎలాంటి విరామం లేకుండానే పనిచేస్తాయి’ అని సంఘాయ్‌ తెలిపారు.