ఎవడేం చేసిండో మొత్తం బయటపెడతా!!

SMTV Desk 2019-08-30 12:46:19  

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాను రూ.4 వేల కోట్లు సంపాదించానంటూ కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి ప్రచారం చేశారని అన్నారు. హుజూరాబాద్‌లో తనను ఓడించేందుకు దొంగల గుంపు తయారైందని అన్నారు. అప్పట్లో సంపత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.

పోలీసుల విచారణలో, తనకే పాపం తెలియదని, దీని వెనక పెద్ద కుట్ర ఉందని సంపత్ పోలీసులకు చెప్పాడని మంత్రి తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొడుకులంతా కలిసి కుట్ర చేస్తున్నారని సంపత్ చెప్పాడని ఈటల వివరించారు. సంపత్ ఇంటరాగేషన్ రిపోర్టు మొత్తం తన వద్ద ఉందని, ఎవడెవడు ఏం చేసిండో సందర్భం వచ్చినప్పుడు మొత్తం బయటపెడతానని ఈటల చెప్పుకొచ్చారు.

రానున్న మునిసిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందన్న ఈటల.. తమ నాయకుడు కేసీఆరేనని స్పష్టం చేశారు. కాగా, హుజూరాబాద్‌లో తాను మాట్లాడిన మాటలను కొన్ని వార్తా చానళ్లు, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించాయన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అన్నారు.

మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకుని ఈటల విమర్శలు గుప్పించినట్టు వార్తలు రావడంతో ఈటలకు కేటీఆర్ ఫోన్ చేసినట్టు సమాచారం. దీంతో రాత్రికి తన వ్యాఖ్యలపై మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన విడుదల చేశారు.