హరీష్‌రావుకు మంత్రి పదవి దక్కుతుందా

SMTV Desk 2019-08-28 14:26:49  

త్వరలోనే కేబినెట్ విస్తరణ జరనుంది..! రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించాక.. కొంత గ్యాప్ ఇచ్చి మంత్రి పదవులు కట్టబెట్టినా.. గత సర్కార్‌లో కీలకంగా పనిచేసిన హరీష్‌రావు, కేటీఆర్‌ను పక్కనబెట్టారు. ఇక, ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులతో తుమ్మలకు కూడా మళ్లీ చోటు దక్కకుండా పోయింది. తర్వాత కేటీఆర్‌కు పార్టీ కీలకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించిన కేసీఆర్.. హరీష్‌రావుకు మాత్రం ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. అయితే, త్వరలోనే జరగనున్న కేబినెట్ విస్తరణలో మళ్లీ హరీష్‌రావుకు పదవి దక్కుతుందని భావించినా.. పరిస్థితులు అనుకూలంగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. దీనిక ప్రధాన కారణం సామాజిక వర్గమే అనే టాక్ నడుస్తోంది.
తెలంగాణ కేబినెట్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి.. వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. అదే సామాజిక వర్గానికి చెందిన వినోద్‌కుమార్‌ కేబినెట్‌ హోదాతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక కేటీఆర్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమనే సమాచారంతో.. వెలమల సంఖ్య నాలుగుకు చేరుతుంది. దీంతో హరీష్‌రావుకు కేబినెట్‌ బెర్త్‌ అనుమానమే అనే చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూస్తే.. హరీష్‌రావును గులాబీ దళపతి క్రమంగా దూరం పెడుతూ వస్తున్నారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత నంబర్ 2గా ఉన్న హరీష్‌రావును ఉద్దేశ్యపూర్వకంగానే పక్కన బెట్టి.. కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితం చేశారని..! తన కుమారుడు కేటీఆర్‌ను ఫోకస్ చేయడానికే హరీష్‌ను తొక్కేస్తున్నారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో హరీష్‌కు మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టి, ప్రాధాన్యాన్ని పెంచే ప్రయత్నం చేయడం కష్టమే అంటున్నారు.