ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌)లో కీలక మార్పులు

SMTV Desk 2019-08-28 14:25:16  

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్‌)లో మార్పులు చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈపీఎస్‌తో పాటు జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)ను చట్టంలో చేర్చాలని భావిస్తుంది. ఉద్యోగి అనుమతితో.. అతని ఇష్టం మేరకు పింఛను పథకం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించబోతుంది ప్రభుత్వం.

2015-16 బడ్జెట్ లో ఇచ్చిన హామీల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ చట్ట సవరణ బిల్లు-2019 ముసాయిదాను కేంద్ర కార్మిక శాఖ రూపొందించింది. ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, పీఎఫ్‌ చందాదారులు, యాజమాన్యాలు, ప్రజలు… సెప్టెంబరు 22వ తేదీలోగా అభ్యంతరాలను rahul.bhagat@ips.gov.in, samir.kumar70@nic.in మెయిళ్లకు ఈ-మెయిల్‌ ద్వారా.. లేదా రాహుల్‌ భగత్‌, డైరెక్టర్‌, కేంద్ర కార్మికశాఖ, రూము నం.302, శ్రమశక్తి భవన్‌, ఢిల్లీ చిరునామా పేరుతో పంపాలని కార్మికశాఖ కోరింది.

ఈపీఎస్‌తో పాటు ఎన్‌పీఎస్‌ను చేర్చాలనే ఆలోచనలో నాలుగేళ్లుగా ఈపీఎఫ్‌వో బోర్డు ఉంది. ఈపీఎస్‌ కింద జీతం పొందుతున్న వ్యక్తులకు పదవీ విరమణ అనంతరం కచ్చితమైన పింఛను వస్తుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కింద జమ చేసిన చందా మొత్తాన్ని ఒకేసారి ఎలాంటి పన్ను లేకుండా తీసుకోవచ్చు. ఈపీఎస్‌లో కొనసాగుతూ అసహాయ, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితుల్లో కొలువును వదిలేస్తే నిధి నుంచి మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

ఇందుకోసం కార్మికుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జీతాలు పొందేవాళ్లకు రెండు ఆప్షన్లు ఇస్తుంది కార్మికశాఖ. ఎన్‌పీఎస్‌లోకి చేరిన వెంటనే ఈపీఎస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఈపీఎఫ్‌వో ధ్రువీకరిస్తుంది. ఉద్యోగి ఎన్‌పీఎస్‌ నుంచి తిరిగి ఈపీఎస్‌కు వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ నిబంధన మేరకు సర్వీసు లెక్కింపు, నిధి మళ్లింపు ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్‌ చట్టం ప్రకారం మూలవేతనం, డీఏ, ఇతర భత్యం కలిపి కనీస వేతనంగా నిర్ణయించి ఉద్యోగి వాటా కింద వేతనం నుంచి 12 శాతం, యజమాని 12 శాతం ప్రావిడెంట్ ఫండ్ కింద జమ చేసేవారు. కేంద్రం వేతన కోడ్‌ను ప్రవేశపెట్టిన క్రమంలో దానిప్రకారం కనీస వేతనం నిర్ణయించి, చందాను తీసుకునేలా బిల్లులో ప్రతిపాదనలు చేస్తున్నారు. తక్కువ వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు వయసు ఆధారంగా చందాను తగ్గించుకునే అవకాశం ఇస్తున్నారు. అయితే యజమాని వాటా (12శాతం) తగ్గించడానికి వీల్లేదని వెల్లడించింది.