పీఎఫ్ బెనిఫిట్స్ ఇక పై వాళ్లకి కూడా ...

SMTV Desk 2019-08-27 11:50:13  

మోదీ ప్రభుత్వం సామాజిక ఆర్థిక భద్రతకు పెద్దపీట వేస్తోంది. అందుకే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ప్రయోజనాలను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. డ్రైవర్లు సహా ఇతర సెల్ఫ్ ఎంప్లాయిడ్ (స్వయం ఉపాధి పొందుతున్నవారు) వ్యక్తులకు కూడా పీఎఫ్ బెనిఫిట్స్ అందించాలని చూస్తోంది. కార్మిక శాఖ ఈ అంశానికి సంబంధించి ‘ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్‌’కు సవరణ చేయాలని భావిస్తోంది.

ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పెన్షన్ స్కీమ్‌ను అసంఘటిత రంగాలకు చెందిన వారికి అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ చట్టానికి సవరణ చేయాలని కేంద్రం భావించడం గమనార్హం. అలాగే కార్మిక శాఖ కొన్ని రంగాలకు చెందిన ఉద్యోగులకు కంట్రిబ్యూషన్‌ను 12 శాతం కన్నా దిగువకు తగ్గించుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముందని ఫైనాన్షియల్ డైలీ పేర్కొంది.

ప్రావిడెంట్ ఫండ్ చట్ట సవరణతో కేంద్రానికి డొమెస్టిక్ హెల్ప్, డ్రైవర్లు, స్వయ ఉపాధి పొందుతున్న వారికి పీఎఫ్ రేట్లు నిర్ణయించే అవకాశం లభిస్తుంది. ఇక వీరికి సంబంధించి కంపెనీ కంట్రిబ్యూషన్ ఉంటుందా? లేదా? అనే అంశంపై కేంద్రం నిబంధనలు రూపొందిస్తుంది.

అలాగే సబ్‌స్క్రైబర్లకు ఈపీఎఫ్‌వో, ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) మధ్య ఏదోఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించనుంది. అలాగే నిర్ణీత ఆదాయానికి దిగువున ఉన్న వారు ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్‌ను వద్దనుకోవచ్చు. అయితే కంపెనీ మాత్రం తన చందాను చెల్లించాలి.

ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామిక అంశాలు మారిన నేపథ్యంలో ప్రావిడెంట్ ఫండ్‌కు సవరణలు చేయాల్సి ఉందని కార్మిక శాఖ పేర్కొంది. అందుకే ఉద్యోగుల భవిష్యనిధి చట్ట సవరణ బిల్లు-2019 ముసాయిదాను రూపొందించింది. ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, పీఎఫ్‌ చందాదారులు, యాజమాన్యాలు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తోంది.