తల్లి కోసం పిల్లని చంపేశాడు

SMTV Desk 2019-08-27 11:49:24  

అతడి పేరు మైసన్ ఆండ్రెస్ టోరెస్. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు. తన ఇంటి దగ్గరలోనే ఉండే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు అప్పటికే రెండేళ్ల కుమార్తె ఉందని తెలిసినా వెనకడుగువేయలేదు. అది చూసి టోరెస్ చాలా మంచివాడని భావించిన ఆమె.. అతనితో డేటింగ్ చేయడానికి ఒప్పుకుంది. అతని ప్రవర్తన నచ్చడంతో వివాహం కూడా చేసుకుందామని అనుకుంది. ఇంతలో ఊహించని షాక్. తన కుమార్తెకు ప్రమాదం జరిగిందని ఓ ఆస్పత్రి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఏం జరిగిందా అనుకుంటూ పరుగుపరుగున ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు డాక్టర్లు భయంకరమైన విషయాలు చెప్పారు. పాపను ఎవరో అత్యంత క్రూరంగా హింసించి చంపేశారని తెలిపారు. ఆ తర్వాత పోలీసు దర్యాప్తులో ఘోరమైన నిజాలు బయటపడ్డాయి. ఇంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్న టోరెస్.. ఆమె లేని సమయంలో పశువులా మారేవాడని, రెండేళ్ల ఆమె కూతుర్ని చిత్రహింసలకు గురిచేసేవాడని పోలీసులు చెప్పారు. పాప శరీరంపై సలసలమరిగే నీళ్లు కుమ్మరించేవాడని, అభం శుభం తెలియని చిట్టిపాపపై పిడిగుద్దుల వర్షం కురిపించేవాడని తెలిపారు. చివరకు ఒకరోజు అతని పశుత్వం పరాకాష్టకు చేరడంతో ఆ పాప గొంతుపిసికి చంపేశాడని తేల్చారు. ఈ విషయం తెలిసిన ఆ తల్లి గుండెబద్దలైంది. ఆమె కన్నీటిని ఆపడం ఎవరితరమూ కాలేదు.