ఆరోగ్యశ్రీ సేవలు పునః ప్రారంభం

SMTV Desk 2019-08-21 13:16:12  

రాష్ట్రంలో 5 రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యశ్రీ పధకంతో అనుసంధానమైన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన రూ.1,500 కోట్లు బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోగులకు సేవలు నిలిపివేశాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆసుపత్రుల ప్రతినిధులతో మంగళవారం రాత్రి జరిపిన చర్చలు ఫలించడంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.

ఈసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆసుపత్రుల ప్రతినిధులు వాదించగా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటి వరకు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపుల రికార్డులను వారికి చూపించి కేవలం రూ.457 కోట్లు మాత్రమే బాకీ ఉన్నట్లు నిరూపించడంతో ఆసుపత్రుల ప్రతినిధులు షాక్ అయ్యారు. అధికారులు సమర్పించిన ఆ వివరాలను తమ రికార్డులతో సరిచూసుకున్నాక బాకీలపై మరోసారి చర్చించుకుందామని వారు తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రుల ప్రతినిధులు లేవనెత్తిన ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తానని మంత్రి ఈటల రాజేందర్‌ వారికి హామీ ఇవ్వడంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించడానికి వారు అంగీకరించారు.