పి.చిదంబరం అరెస్ట్ అయ్యే అవకాశాలు

SMTV Desk 2019-08-21 13:15:00  

ఒకప్పుడు యూపీయే ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా చక్రం తిప్పిన పి.చిదంబరం అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు గ్రహించడంతో ఆయన డిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. కానీ దానిని కోర్టు తిరస్కరించడంతో కనీసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసుకునే వరకు అరెస్ట్ చేయకుండా ఆపాలని కోరారు. కానీ దానికీ డిల్లీ హైకోర్టు అంగీకరించకపోవడంతో ఆయన మంగళవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సిబిఐ అధికారులు మంగళవారం రాత్రి డిల్లీలోని ఆయన నివాసానికి వెళ్ళి , ఈరోజు విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు గోడకు అంటించి వచ్చారు. ముందస్తు బెయిల్‌ కోసం చిదంబరం తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్‌.వి. రమణ తిరస్కరించారు. అయితే ముందస్తు బెయిల్‌పై పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి రంజన్ గగోయ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆయనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎన్‌.వి.రమణ తెలిపారు.

మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరంపై మోడీ ప్రభుత్వం ఈవిధంగా కక్షసాధింపు చర్యలకు పూనుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా? ఆయన దోషా నిర్ధోషా? అనేది న్యాయస్థానం తెలుస్తుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు ‘మనకు ఈ ప్రపంచంలో ఎదురేలేదు... మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు,’ అన్నట్లు వ్యవహరిస్తూ అవినీతికి, అక్రమాలకు పాల్పడే నేతలకు అధికారం కోల్పోతే ఎటువంటి దుస్థితి దాపురిస్తుందో తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.