నేడు చంద్ర కక్షలోకి చంద్రయాన్ ప్రవేశం

SMTV Desk 2019-08-20 11:38:10  

న్యూఢిల్లీ: చంద్రుని కక్ష లోకి చంద్రయాన్ 2 ను పంపడానికి ఇస్రో మంగళవారం ఉదయం 8.30-9.30 గంటల మధ్యలో ద్రవ రూప(లిక్విడ్) ఇంజిన్‌ను పేల్చుతుందని ఇదో ఛాలెంజి అని ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ ) ఛైర్మన్ కె. శివన్ వెల్లడించారు. ఇక్కడ నుంచి చంద్రుని తుది కక్షలోకి చేరుకోడానికి నాలుగు కక్ష స్థాయిలను అధిగమించ వలసి వస్తుందని అన్నారు. ఆ తరువాతనే చంద్రుని ఉపరితలం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ధ్రువ ప్రాంతాలను చేరుకోగలుగుతామని వివరించారు. క్రమానుగతంగా సెప్టెంబర్ 2 న ఆర్బిటర్ నుంచి విక్రమ్ లాండర్ విడిపోతుందని, బెంగళూరు కేంద్రమైన అంతరిక్ష సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలంపై సున్నితంగా దిగడానికి వీలుగా రెండు కక్షల స్థాయిలను లాండర్ అధిగమించ వలసి వస్తుందని ఇస్రో చెప్పిం ది. చంద్రయాన్ ఆగస్టు 14న భూ కక్షను విడిచిపెట్టింది. జులై 22న ప్రయోగాలు నిర్వహించడానికి 13 సాధనాలతో చంద్రయాన్ 2 బయలు దేరింది. మెగ్నీషియం, ఇనుము, కాల్షియం తోపాటు నీటి వనరులు ఏవేవి ఎంతవరకు చంద్రుని ఉపరితలంపై ఉన్నాయో అన్వేషిస్తుంది. ఈ మిషన్ చంద్రుని పుట్టుపూర్వోత్తరాలు పరిణామం, ఖనిజ వనరుల విశ్లేషణ తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది. మిగతా ప్రయోగాలు చంద్రునిపై నిర్వహించడానికి వీలవుతుంది.