ఆగస్ట్ 22 నుంచి రెండు రోజులు ఫ్రాన్స్‌లో

SMTV Desk 2019-08-20 11:37:12  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్ట్ 22 నుంచి రెండు రోజులు ఫ్రాన్స్‌లో అధికారికంగా పర్యటిస్తారు. తన పర్యటనలో మోడీ ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో సమావేశమై, రక్షణ, అణుశక్తి, సముద్రప్రాంత సహకారం, ఉగ్రవాదంపై పోరు వంటి కీలక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాల్ని బలోపేతం చేసుకోవడంపై చర్చిస్తారు. ఫ్రాన్స్ నుంచి ఆయన ఎమిరేట్స్, బహ్రెయిన్‌లలో ద్వైపాక్షిక పర్యటన జరుపుతారు. ఆగస్ట్ 25న జి 7 శిఖరాగ్ర సభకు హాజరయ్యేందుకు తిరిగి ఫ్రెంచ్ నగరం బియారిట్జ్ చేరుకుంటారు. జి 7కు ఇండియా భాగస్వామ్య దేశ హోదాలో ఆహ్వానం అందుకుంది. గురువారం సాయంకాలం తిరిగి ఫ్రాన్స్ చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ సరాసరి మాక్రాన్‌తో చర్చలకు వెడతారు. అక్కడ మాక్రాన్ మోడీకి విందు ఇస్తారు. మర్నాడు భారత ప్రధాని ఫ్రెంచ్ ప్రధాని ఎడౌర్డ్ ఛార్లెస్ ఫిలిప్పీని కలుసుకుంటారు. ప్యారిస్‌లోని యునెస్కో కార్యాలయంలో అక్కడి భారతీయులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంలోనే ఆయన… 1950, 1966లలో జరిగిన రెండు ఘోర విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరిస్తారు.