ఆదిలాబాద్ ను ఎందుకు పట్టించుకుంట లేరు ?

SMTV Desk 2019-08-20 11:34:43  

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం కాగజ్‌నగర్‌ మండలంలో పెద్దవాగుపై నిర్మితమవుతున్న జగన్నాథ్ పూర్ ప్రాజెక్టులు నిర్మాణపనులను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టుకు వేలకోట్లు ఖర్చుచేస్తూ యుద్ధప్రాతిపాదికన పూర్తి చేయిస్తున్న సిఎం కేసీఆర్‌ ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పరుగులు తీయిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న సిఎం కేసీఆర్‌ జిల్లాలో గత 14 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన జగన్నాథ్ పూర్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదు?కుమురంభీం వట్టివాగు, నీలివాగు ప్రాజెక్టుల పనులలో కూడా ఎటువంటి పురోగతి లేదు. కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకు తప్ప అదిలాబాద్ జిల్లాలో రైతులను సిఎం కేసీఆర్‌ పట్టించుకోరా? జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో పంటలకు నీళ్ళు అందక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా యుద్ధప్రతిపాదికన జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.