రాజమౌళి నా తండ్రి, సమంత నా మరదలు

SMTV Desk 2017-08-30 17:54:50  ARJUN REDDY MOVIE, RAMGOPAL VARMA, V. HANUMANTHA RAO, VIJAY DEVARAKONDA.

హైదరాబాద్, ఆగస్ట్ 30 : థియేటర్స్ కు రాకముందే వివాదస్పదాల్లో చిక్కుకున్న చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ సినిమా విడుదలైన తరవాత మరింత వివాదస్పదమవుతూ వస్తుంది. ఇటు ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకు౦టున్న ఈ చిత్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు పోరాడుతుంటే.. మరోవైపు ప్రముఖులు ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్ ఈ చిత్రం గురించి స్పందించగా ఆగ్రహించిన వీహెచ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకున్న మీరు ఒక డాక్టర్ డ్రగ్స్ తీసుకొని ఆపరేషన్లు చేసే సినిమాకు ఎందుకు మద్దతిస్తున్నారు? అంటే హీరో మనవాడే.. మన బంధువే అని ఎక్కువ రోజులు ఆడాలని చూస్తున్నారా? ఈ సినిమాలో డ్రగ్స్, ర్యాగింగ్, పెళ్ళికి ముందే గర్భవతిని చేయడం ఇలాంటివన్నీ చూపించారు. ముఖ్యమంత్రి గారు మీరు సినిమా చూసి చెప్పండి నేను చెప్పింది తప్పా? ఒప్పా? అని మీరే నిర్ణయించండి అంటూ సూచించారు. హనుమంత రావు వ్యాఖ్యలు విన్న విజయ్ దేవరకొండ తన ఫేస్‌‌బుక్ ఖాతాలో స్పందిస్తూ.. డియర్ తాతయ్య అర్జున్ రెడ్డి సినిమాను అభినందించినందుకే కేటీఆర్ నా బంధువు అయితే.. మరి నా సినిమాను ప్రశంసించిన రాజమౌళి గారు నా తండ్రి. రానా, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా సోదరులు. నాకు సినిమాలో సిస్టర్స్ అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి.. సమంత, అను ఇమ్మాన్యుయెల్, మెహ్రీన్ నా మరదళ్లు. నా సినిమా చూసిన స్టూడెంట్స్, స్త్రీ, పురుషులందరూ నా ట్విన్స్. ఇక రామ్ గోపాల్ వర్మ సర్ అయితే మన ఇద్దరిలో ఎవరి ఫాదరో ఇంకా క్లారిటీ లేద౦టూ వ్యంగంగా సమాధానం ఇచ్చాడు.