కోహ్లీకి క్షమాపణలు చెప్పిన డేల్‌ స్టెయిన్‌

SMTV Desk 2019-08-14 18:11:56  

సెప్టెంబరు 15 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభంకానున్న టీ20, టెస్టు సిరీస్‌ల కోసం తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాజాగా రెండు జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో తనకు చోటు దక్కకపోవడంపై దక్షిణాఫ్రికా పేసర్ డేల్‌ స్టెయిన్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టెయిన్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కొనసాగుతానని చెప్పాడు. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. అయితే, ఈ పర్యటన కోసం ప్రకటించిన టీ20 జట్టులో డేల్ స్టెయిన్‌ లేకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన స్టెయిన్‌ అనంతరం గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నప్పటికీ సెలక్టర్లు మొండిచేయి చూపడంపై ఆసహనం వ్యక్తం చేశాడు. భారత పర్యటనకు సఫారీ జట్టుని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించిన వెంటనే డేల్ స్టెయిన్‌ తన ట్విట్టర్‌లో టీ20 సిరిస్‌లో తనను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను సెలక్టర్లు చెప్పకపోవడం నిరుత్సాహపరిచిందంటూ ట్వీట్ చేశాడు. టీ20 జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు భారత అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. టెస్టు రిటైర్మెంట్‌ ప్రకటించే సమయంలో టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్‌ తప్పక ఆడతానని స్టెయిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా తరుపున మొత్తం 93 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 3.24 ఎకానమీతో 439 వికెట్లు తీశాడు. ఇక, 44 టీ20ల్లో 6.79 ఎకానమీతో 61 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ సందర్భంగా స్టెయిన్ "నాకు ఎంతో ఇష్టమైన ఒక క్రికెట్ ఫార్మాట్ నుంచి ఈ రోజు తప్పకుంటున్నాను. నా దృష్టిలో టెస్ట్ క్రికెటే అత్యుత్తమైంది. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా అది మనల్ని పరీక్షిస్తుంది" అని అన్నాడు.భారత్‌తో మూడు టీ20ల సిరిస్‌కు ముగ్గురు కొత్త ఆటగాళ్లను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. టెంబా బావుమా జోర్న్ ఫోర్టుయిన్‌లతో పాటు అన్రిచ్ నొర్ట్‌జేలు టీ20ల్లో అరంగేట్రం చేయనున్నారు. టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు డుప్లెసిస్‌ను పక్కకు పెట్టి డికాక్‌ను దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.