టాప్ స్పీడ్‌తో దూసుకెళ్తోన్న షేర్లు

SMTV Desk 2019-08-13 17:12:21  

ప్రముఖ ఇండస్ట్రీస్ రిలియన్స్ షేర్లు దశాబ్ద కాలంలోనే ఎన్నడులేనంతగా టాప్ స్పీడ్‌తో దూసుకెళ్తోన్నాయి. అపర కుబేరుడు, ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ వచ్చే నెలలో హోమ్ ఇంటర్నెట్ సర్వీసులు లాంచ్ చేయనున్నారు. దీంతో బ్రాడ్‌బాండ్ విభాగంలోనూ సంచలనాలు క్రియేట్ చేయనున్నారు. ఇప్పటికే ఉచిత వాయిస్ కాల్స్, చౌక ధరకే డేటా వంటి వ్యూహాలతో టెలికం రంగంలో రిలయన్స్ జియోతో సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర మంగళవారం ఇంట్రాడేలో ఏకంగా 12 శాతానికి పైగా పరుగులు పెట్టింది. 2009 జనవరి 14 నుంచి చూస్తే షేరు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. దీంతో కంపెనీ మరోసారి దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించేందుకు దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం టీసీఎస్ టాప్‌లో ఉంది. రెండింటి మధ్య అంతరం తక్కువగా ఉంది. అదేసమయంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు వరుసగా 4 శాతం, 5 శాతం కుప్పకూలాయి. బ్రాడ్‌బాండ్ విభాగంలోనూ టెలికంలోని ఘటనలే ఎదురుకావొచ్చనే ఆందోళనలు ఇందుకు కారణం. రిలయన్స్ ఏజీఎం‌లో గిగాఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజునే ఇంట్లోనే కూర్చొని టీవీలో ఆ మూవీ చూడొచ్చని అంబానీ తెలిపారు. దీంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు వరుసగా 8 శాతం, 10 శాతం కుప్పకూలాయి.